సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల ప్రణాళికలో భాగంగాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎయిర్‌పోర్డు మెట్రోకు శంకుస్థాపన సహా అనేక బూటకపు వాగ్దానాలను చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన హామీలనే ఇప్పుడు తిరిగి కొత్తగా చెబుతూ తెలంగాణ ప్రజలను కేసీఆర్ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
తన ఎన్నికల ప్రణాళికలో భాగంగానే ఫాంహౌస్‌ను వదిలి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేసి అన్ని కోట్లు ఇస్తాం... ఇన్ని కోట్లు ఇస్తాం అంటూ సెంటిమెంటును ప్రజల్లో రేకెత్తించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి...
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోకు శంకుస్థాపన చేయడానికి సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణాన్ని చేపట్టనీయం, ఎవరినీ ఒక్క గజం కూడా తిరగనీయం అంటూ గతంలో చేసిన హెచ్చరికలను గుర్తుచేసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. గతంలో మెట్రో నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన వ్యక్తికి... ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
మెట్రో రెండో దశలో భాగంగా చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్... పాతబస్తీ మీదుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.2 కిలోమీటర్లు పొడవున నిర్మించాల్సిన మెట్రో లైన్ పనులను ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీ మెట్రో పనులను కాదని.. ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులతో ముందుకు వెళ్లడం చూస్తుంటే అనధికారిక మిత్రులు ఒవైసీల మాటకు కట్టుబడి ఓల్డ్ సిటీ ప్రజలకు మెట్రోను దూరం చేయాలని నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment