![Union Minister Kishan Reddy wrote another open letter to KCR - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/26/kishan%20reddy.jpg.webp?itok=BOkWiZRI)
సాక్షి, హైదరాబాద్: ‘‘సబ్బండ వర్గాల’ఉద్యమాన్ని స్వార్థంతో మింగేసిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సారథిగా తనను తాను ప్రకటించుకున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘తెలంగాణ ఉద్యమంలో మీ స్వార్థాన్ని గురించి రాస్తే.. పెద్ద గ్రంథాలే తయారవుతాయి’అని నిందించారు. శనివారం సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి మూడో బహిరంగ లేఖ సంధించారు.
’’జలదృశ్యం’వేదికగా గాంధేయవాది కొండాలక్ష్మణ్ బాపూజీను ఉపయోగించుకున్నారు. తర్వాత బాపూజీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. మీతోపాటు తొలి అడుగులు వేసిన గాదె ఇన్నయ్య, విజయరామారావు, రవీంద్రనాయక్, మేచినేని కిషన్‌రావు వంటి నాయకులెందరినో విజయవంతంగా పక్కకు తప్పించడం మీకున్న ప్రత్యేక నైపుణ్యానికి ఒక ఉదాహరణ. తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో ఉన్న ఆచార్య జయశంకర్ సార్ వంటి తెలంగాణవాది భుజాలమీద ఎక్కి మేధావులను ముగ్గులోకి లాగారు.
ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న, ఒడ్డుచేరినాంక బోడ మల్లన్న’అనే సామెత మీకు సరిగ్గా నప్పుతుంది’అని ఆ లేఖలో ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల వద్ద నక్క వినయాలు ప్రదర్శించి సానుభూతి పొందేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ‘సెంటిమెంటును వాడుకుని ఎన్నికల్లో గెలవడం మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు’’అని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయి
‘ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్ వంటి నాయకులను మీతో కలుపుకోవడం ద్వారా వారికి అస్తిత్వం లేకుండా చేయడం, మీ పనైపోయిన తర్వాత వారిని పక్కకు జరిపేయడం మీ ప్రత్యేకత. మీ చేతిలో మోసపోయిన వారిలో ఎక్కువమంది వెనుకబడిన వర్గాల వారే. ధర్నాలు, దీక్షలు, వంటావార్పు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, సాగరహారం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటివన్నీ ప్రజలు చేస్తుంటే.. ‘గాలికిపోయే పిండి కృష్ణార్పణం’అన్నట్లు..’చివర్లో మీరు, మీ కుటుంబసభ్యులే గెలిపించామన్నట్లు ఫోజులివ్వడం.. వంటివన్నీ తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని ఆ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమకారులను ఉరికించి కొడుతుంటే.. దిక్కుమొక్కులేని ఉద్యమాన్ని.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, కులసంఘాలు, మేధావులు, జర్నలిస్టులు.. అక్కున చేర్చుకుని తమ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రం సాధించిన తర్వాత వారందరి పరిస్థితి దయనీయంగా మారింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెబుతారు’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment