సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు.
వెంటనే భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు రూ.2,585 కోట్లను జమ చేయాలని.. హైవే నిర్మాణం వేగంగా సాగేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు తెలంగాణలో మరో 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 4,048 హెక్టార్ల భూమిని వెంటనే సేకరించి ఇవ్వాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బుధవారం రెండు లేఖలు రాశారు.
ప్రాజెక్టు ఆలస్యమైతే సమస్యలు
కేంద్రం భారత్‌మాల పరియోజనలో భాగంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరం చుట్టూ 350 కిలోమీటర్లకుపైగా రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను నిర్మి స్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ వ్యయా న్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం చెరో సగం భరించేలా ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,585 కోట్లను వెంటనే ఎన్‌హెచ్‌ఏఐకి జమ చేసి నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 3న తాను స్వయంగా రాష్ట్ర సర్కారుకు లేఖ రాశానని, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాల అధికారులు కూడా పలుమార్లు లేఖలు రాశారని.. అయినా ఆశించిన స్పందన రాలేదని వివరించారు. రాష్ట్రవాటా నిధుల జమలో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు జాప్యమై ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయన్నారు.
భూసేకరణ త్వరగా చేయండి
66 ఏళ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. తెలంగాణ ఏర్పాటయ్యాక గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలోనే ఎన్డీయే సర్కారు మరో 2,500 కి.మీ జాతీయ రహదారులను నిర్మించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున 11 జాతీ య రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment