సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: పాకిస్తాన్‌పై సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సీఎం కేసీఆర్ ఆధారాలు కోరడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలుగా అభినందన్ వర్ధమాన్ పరాక్రమం, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఫ్లై జోన్‌ను నిషేధించిన పాకిస్తాన్ చర్యలు సరిపోవా అని నిలదీశారు. ఇవీ చాలకపోతే కేసీఆర్ నేరుగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆధారాలు కోరవచ్చని చురకలంటించారు.
కేసీఆర్ బాధ్యతారహితంగా చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన టుక్డే.. టుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్‌తో చేరినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్పందనలేని గుణానికి, బాధ్యతారాహిత్యానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విడిగా ఓ ప్రకటనలోనూ ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఈ తీరును వారు ఎన్నటికీ క్షమించరన్నారు.
కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: కేంద్ర మంత్రులు ఠాకూర్, గిరిరాజ్
సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. సైనికుల ధీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడటం ఆయన మానసిక వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు. పాక్ సైనికులపైనే కేసీఆర్‌కు ఎక్కువ నమ్మకం ఉన్నట్లుందని అనురాగ్ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు కావాలంటే నేరుగా పాక్‌నే కోరాలని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సవాల్ సూచించారు.
దేశం క్షమించదు: అసోం సీఎం
సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అవమానిస్తే దేశం క్షమించదని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సైన్యం చూపిన వీడియో ఆధారాలు కేసీఆర్‌కు చాలవా అని ఆయన ప్రశ్నించారు. సైన్యంపై దాడి చేయాలని, దుష్ప్రచారం చేయాలని ఎందుకు తహతహలాడుతున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ సైన్యంపై అవిశ్వాసం చూపరాదని విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment