లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సమాజ్‌వాదీపార్టీలో మళ్లీ కుటుంబ కలహాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. శాసనసభా పక్ష సమావేశానికి తనను పిలవలేదని అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ ఆరోపించారు. సైకిల్ గుర్తుపైనే తానూ గెలిచానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శివపాల్ ఆరోపణలపై ఎస్పీ వివరణ ఇచ్చింది. లక్నోలో జరిగింది ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశమని యూపీ ఎస్పీ చీఫ్ నరేషోత్తమ్ అన్నారు. సోమవారం సాయంత్రం భాగస్వామ్యపక్షాలతో అఖిలేష్ భేటీ అవుతారని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అఖిలేష్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయనను ఎస్పీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేష్ కర్హాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే అజంఘడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు.
చదవండి: (కోదండరామ్‌కు అరవింద్ కేజ్రీవాల్ ఆఫర్! ఆ పార్టీ విలీనం తప్పదా?)
కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్‌వాది పార్టీలో కుటుంబ కలహాలు భగ్గుమన్నాయి. పార్టీపై ఆధిపత్యం కోసం శివపాల్, అఖిలేష్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో 2019లో ఎస్పీ నుంచి బయటకొచ్చిన శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని పెట్టారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు బాబాయ్, అబ్బాయ్‌కి మధ్య రాజీ కుదిరింది. దీంతో జశ్వంత్‌నగర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీచేసి శివపాల్ 90వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. అయితే తాజాగా సైకిల్ గుర్తుపై గెలిచిన తనను ఎస్పీ శాసనసభా పక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై శివపాల్ గుర్రుగా ఉన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శివపాల్ తెలిపారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ చీలిక తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment