డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్న గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారని విస్తృత ప్రచారం కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే వ్యూహం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. ఈ ఊహించని పరిణామంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది.
చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా
పురోలా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ కండువా కప్పి రాజ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ... అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బీజేపీ పని చేస్తోంది. కానీ కాంగ్రెస్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బడుగు, బలహీనవర్గాలను సబ్సిడీలపై ఆధారపడి బతికేలా చేసింది. ఉత్తరాఖండ్‌లో మెరుగైన పాలనను చూసి బీజేపీలో చేరా’ అని పేర్కొన్నారు.
రాజ్‌కుమార్ గతంలో బీజేపీలోనే కొనసాగారు. 2007-2012 మధ్య బీజేపీలో ఉన్న ఆయన అనంతరం 2012లో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికల దృష్ట్యా బీజేపీ ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది. 2017లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. పార్టీలో విబేధాలు రాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పార్టీ పాత నాయకులను తిరిగి చేర్చుకుంటోంది. అందులో భాగంగానే రాజ్‌కుమార్ బీజేపీలో చేరిక.
చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం
Comments
Please login to add a commentAdd a comment