ఉత్తరాఖండ్‌లో కొన్నేళ్లుగా బీజేపీదే హవా
రెండు ఎన్నికల్లోనూ స్వీప్
ఈసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ యత్నం
హిమాలయ పర్వత సిగలో బద్రీనాథ్, కేధార్‌నాథ్ వంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన ‘దేవభూమి’ ఉత్తరాఖండ్. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాంచల్‌గా ఏర్పాటైన ఈ రాష్ట్రం పేరు 2006లో ఉత్తరాఖండ్‌గా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెసే చక్రం తిప్పుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచిన ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ (యూకేడీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) కూడా కాస్త ప్రభావం చూపుతున్నాయి.
పదేళ్లుగా ఉత్తరాఖండ్ పూర్తిగా కాషాయమయమైంది. అటు అసెంబ్లీలో, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవాయే నడుస్తోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన కమలనాథులు ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం చేతులు మారింది. 2012 నుంచీ మాత్రం రాష్ట్రం బీజేపీ గుప్పిట్లోనే ఉంది.
2002లో కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీ తివారీ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి చేపట్టిన తొలి, ఏకైక నేతగా చరిత్ర సృష్టించారు. 2007లో ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీఎస్‌పీ, యూకేడీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
విజయ్ బహుగుణ, హరీశ్ రావత్ రూపంలో ఆ ఐదేళ్లలో ఇద్దరు సీఎంలను మార్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, రాష్ట్రపతి పాలన, సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ విశ్వాస పరీక్షలో నెగ్గడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 5 సీట్లను దక్కించుకున్న బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచి్చంది.
మొత్తం 70 సీట్లలో ఏకంగా 57 స్థానాలను కొల్లగొట్టింది! 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ 47 సీట్లతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 19 సీట్లతో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పూర్వ వైభవం కోసం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 5 ఎంపీ సీట్లలో ఒకటి ఎస్సీ రిజర్వుడు స్థానం.
సర్వేలు ఏం చెబుతున్నాయి...
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యంతో బీజేపీ మంచి జోరు మీదుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలతో హోరెత్తిస్తోంది. కాంగ్రెసేమో ఇండియా కూటమి దన్నుతో మొత్తం ఐదు స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ సర్కారు కుమ్మక్కు వంటివాటిని ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. కులగణన, సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు వంటి హామీలను గుప్పిస్తోంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా 5 సీట్లూ గెలుచుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment