రూర్కీ: ఉత్తరరాఖండ్‌లో పొలిటికల్ గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. రూర్కీలోని ఖాన్పూర్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ క్యాంప్ ఆఫీస్‌పై కాల్పులు జరిపిన కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్‌ను హరిద్వార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
గత కొంతకాలంగా ఈ నేతలిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం, ఖాన్పూర్ మాజీ ఎమ్మెల్యే ఛాంపియన్ తన అనుచరులతో కలిసి కుమార్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరి నేతల అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. అలాగే కర్రలతో దాడి చేసుకున్నారు.
ఖాన్పూర్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖాన్పూర్ నియోజకవర్గంలో ఛాంపియన్ భార్య కున్వరాణి దేవయానిని ఓడించినప్పటి నుండి ఇద్దరి మధ్య వైరం నెలకొంది. ఆదివారం బీజేపీ నేత ఛాంపియన్ గాల్లోకి బుల్లెట్లను పేల్చాడని, దీంతో ఉద్రిక్తత నెలకొందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ దోవల్ మాట్లాడుతూ భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఛాంపియన్‌ను అరెస్టు చేశామని తెలిపారు. అలాగే ఛాంపియన్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఉమేష్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశామని, ఆయనతో పాటు ఆయన మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నేతలకు చెందిన ఆయుధ లైసెన్స్‌లను నిలిపివేయాలని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫారసు చేసినట్లు దోవల్ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కాగా చట్టంతో ఆటలాడుకోవడం ప్రజా ప్రతినిధులకు తగదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్ అన్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరినట్లు భట్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ లేదా దేశ రాజ్యాంగం లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించవని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment