
గన్నవరం: ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో కలిసి పనిచేద్దామని జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేశ్ ఆహ్వానించడం అతి పెద్ద జోక్ అని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. నందమూరి వంశీకుల పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం అంటే అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్‌కు తాత అని, లోకేశ్ తాత ఖర్జూర నాయుడని చెప్పారు. 2009 ఎన్నికల్లో లోకేశ్ గాలికి తిరుగుతున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రాణాలొడ్డి పనిచేశారని గుర్తుచేశారు. అటువంటి ఎన్టీఆర్‌కు ఎవరి దయ అవసరం లేదన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు ఖండన
గన్నవరం పాకిస్తాన్‌లో ఉందా.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలను వంశీ తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరైనా, ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్లొచ్చని, సెక్షన్ 144 అమలులో ఉన్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎవరినైనా నియంత్రించొచ్చని గుర్తుచేశారు.
ముద్రగడ పద్మనాభంను మూడేళ్లు ఇంటి నుంచి బయటకు రాకుండా, మంద కృష్ణమాదిగను ఐదేళ్లపాటు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు ఏ చట్టం, ఏ రాజ్యాంగం ప్రకారం అడ్డుకున్నారో చెప్పాలన్నారు. తనను పశువుల డాక్టర్ అని హేళన చేస్తున్న చంద్రబాబు ఏమైనా ఆర్‌ఈసీ వరంగల్‌లో, లోకేశ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారా.. అని ప్రశ్నించారు.