ఆ ఘనత వైఎస్సార్‌దే : వల్లభనేని వంశీ | Vallabhaneni Vamsi Welcomes Free Power Scheme In AP | Sakshi
Sakshi News home page

ఆ ఘనత వైఎస్సార్‌దే : వల్లభనేని వంశీ

Published Mon, Sep 7 2020 5:08 PM | Last Updated on Mon, Sep 7 2020 8:20 PM

Vallabhaneni Vamsi Welcomes Free Power Scheme In AP - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్‌ అందించిన ఘనత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు చేయలేని పనిని వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే చేసి చూపించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్నారని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల పాలనలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబే అని మండిపడ్డారు. వైఎస్సార్‌ దారిలోనే నడుస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని అభినందించారు. సీఎం జగన్ ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు చేపట్టారని, నగదు బదిలీ పథకం వల్ల రైతులకు భరోసా ఉంటుందన్నారు. (మహిళలకు మరో ‘రత్నం’)

వైఎస్సార్‌ తొలి సంతకం..
సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వల్లభనేని వంశీ మాట్లాడారు. ‘రానున్న 30 ఏళ్లకు రైతులకు భరోసాగా ఉండాలని వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. ఆనాడు మోటార్లకు ఉన్న మీటర్లు పీకిసి స్లాబ్ సిస్టం తీసుకువచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పై చులకనగా మాట్లాడారు. ఆనాడు వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చి అధికారంలోకి రాగానే తొలి సంతకం చేసి అమలు చేశారు. రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతలో ఉచిత విద్యుత్‌కు గాను నగదు బదిలీ చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. (అన్‌లాక్ 4.0: ఏపీ సర్కార్‌ మార్గదర్శకాలు జారీ)

చంద్రబాబు 42 ఏళ్ళ అనుభవం ఏమైంది..?
గన్నవరం నియోజకవర్గంలో మెట్టప్రాంత మండలాల్లో పోలవరం కుడి కాలువ నుంచి రైతులు 600 మోటార్లు ద్వారా నీరు వినియోగిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ కనెక్షన్లు క్రమబద్దీకరణ చేయలేదు.ఈ రోజు సీఎం జగన్‌మోహన్రెడ్డి విద్యుత్ కనెక్షన్లు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 17 లక్షలు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, అదనంగా ఉన్న మరో లక్ష విద్యుత్ కనెక్షన్లు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పదివేల మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. చంద్రబాబు 42 ఏళ్ళ అనుభవం ఏమైంది..? చంద్రబాబు తన కొడుకు లోకేష్‌లా స్థాయి దిగి మాట్లాడుతున్నారు. రాజకీయ అనుభవం ఉండి చిల్లరగా మాట్లాడితే పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. ఉచిత విద్యుత్‌పై విమర్శలు సరికాదు.

గన్నవరం నియోజకవర్గంలో అందరిని కలుపుకుని ముందుకు వెళ్తాను, వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలు అందరూనాతోనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న సీనియర్లు అందరిని తాను కలుపుకుని ముందుకు వెళ్తున్నాను. నూటికి 95 మందిని అందరిని కలుపుకుని గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తాను. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందుతున్నాయి. వలంటీర్లు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే చాలా మెరుగ్గా పని చేస్తోంది. గతంలో ఫించన్, ఇళ్ల స్థలాలు రాలేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు 90 % క్షేత్రస్థాయిలో సమస్యలు తీరాయి.’ అని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement