Lok Sabha Elections: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్‌ గాంధీ! | Varun Gandhi May fight independently if BJP Denies ticket | Sakshi
Sakshi News home page

Pilibhit: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్‌ గాంధీ!

Published Wed, Mar 20 2024 2:39 PM | Last Updated on Wed, Mar 20 2024 4:48 PM

Varun Gandhi May fight independently if BJP Denies ticket - Sakshi

లక్నో: దేశంలో ఎన్నికల హడావిడీ ఉంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపిక, ప్రచారాలపై దృష్టి సారించాయి. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు టికెట్‌ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి సీటు రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రంగా లేదా వేరే పార్టీ తీర్ధం పుచ్చుకొనైనా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు.

ఈ క్రమంలో బీజేపీ నేత వరుణ్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్‌ నుంచి బీజేపీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వరుణ్‌ కాషాయ పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ ఇచ్చేందుకు సుముఖంగా లేన్నట్లు ప్రచారం నడుస్తోంది.

పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని సంబందిత వర్గాలు తెలిపాయి. ఇక పిలిభిత్‌ స్థానానికి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆయన ప్రతినిధులు ఢిల్లీ నుంచి యూపీకి ఇప్పటికే తీసుకొచ్చారని పేర్కొన్నాయి. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్‌గాంధీ పిలిభిత్‌ నుంచి పోటీ చేసి రెండోసార్లు గెలుపొందారు. అయితే పిలిభిత్‌ స్థానానికి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించింది. అంబేద్కర్ నగర్ నుంచి బీఎస్సీ  మాజీ ఎంపీ రితేష్ పాండేని పోటీకి దించగా.. హేమ మాలిని, రవి కిషన్, అజయ్ మిశ్రా తేని, మహేష్ శర్మ, ఎస్‌పీఎస్‌ బాఘెల్, సాక్షి మహరాజ్‌లను  తమ స్థానాల నుంచి మరోసారి అవకాశం ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి నుంచి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్‌ గాంధీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలపై పలు సందర్భాల్లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు.. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కొంతకాలంగా తన లోక్‌సభ నియోజకవర్గమైన పిలిభిత్‌లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement