తిరుమావళవన్
సాక్షి, చెన్నై: రజనీ పార్టీ ఏర్పాటు వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఉన్నట్టు వీసీకే నేత తిరుమావళవన్ ఆరోపించారు. ఆదివారం తిరుమావళవన్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ స్వతంత్రంగా పార్టీ గురించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించడం లేదన్నారు. ఆయనలో ఆ లక్షణాలే కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరికో బయపడి, బెదిరింపులకు తలొగ్గి, ఒత్తిడికి గురై పార్టీ ఏర్పాటు ప్రకటన చేసినట్టుగా ఉందని పేర్కొన్నారు. ఒత్తిళ్లతో రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి రజనికీ ఏర్పడి ఉండడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.
సీపీఎం నేత బాలకృష్ణన్ మాట్లాడుతూ.. రజనీకాంత్ పగటి కలలు కంటుతున్నారని విమర్శించారు. ఇదేదో సినిమా షూటింగ్ అన్నట్టుగా పార్టీ ఏర్పాటు, ఎన్నికలంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని అయితే అందుకు తగ్గట్టు శ్రమించాల్సి ఉంటుందన్నారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ మాట్లాడుతూ.. తన మక్కల్ మండ్రంలో మూడేళ్లుగా శ్రమిస్తున్న వారిలో సమర్థులైన నాయకులు ఎవ్వరూ రజనీకి కనిపించలేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి వచ్చిన ఆర్జున్‌మూర్తికి, అన్ని పార్టీలను చుట్టి వచ్చిన తమిళరివి మణియన్‌లకు రాగానే పదవిని కట్టబెట్టడం బట్టి చూస్తే ఆయనకు ఏ మేరకు రాజకీయలపై పట్టు ఉందో అర్థమవుతోందన్నారు. తనను నమ్ముకున్న వాళ్లను కాదని, బయటి వ్యక్తులను పదవుల్లో కూర్చొబెట్టడాన్ని ఆయన అభిమానులే తీవ్రంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: (రజనీ పొలిటికల్ ఎంట్రీ: ఆ పార్టీల్లో ప్రకంపనలు)
Comments
Please login to add a commentAdd a comment