
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వేంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఆయన సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు.
సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని వాడలేదని చెప్పారన్నారు. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యి వాడలేదు కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో పాటు, దానిపై సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసిందని చెప్పారు. జూలై 23 నుంచి సెప్టెంబరు 18 వరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని కూడా సర్వోన్నత న్యాయస్ధానం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిందని తెలిపారు. సిట్ నియామకాన్ని కూడా ప్రశ్నించిందన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వెల్లంపల్లి మరోసారి చంద్రబాబుకి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment