సాక్షి, పశ్చిమగోదావరి: జనసేనలో సీట్ల పంచాయితీ ‘ముష్టి’ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు జనసేన శ్రేణులు చుక్కలు చూపించాయి. ఆయన బస చేసిన చోట నిరసనకు దిగాయి. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ నాదెండ్లపై దాడికి సైతం యత్నించాయి.
తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్‌లో రాత్రి బస చేశారాయన. సమాచారం అందుకున్న వెంటనే జనసేన ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో గెస్ట్‌హౌజ్ దగ్గర నిరసనకు దిగారు. రామచంద్రరావుకు అనుకూలంగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్‌లు ఎంత సముదాయించిన రామచంద్రరావు మాట వినలేదు. ‘టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా’ అంటూ బెదిరించారు. ఈ క్రమంలో బొలిశెట్టి వర్సెస్ విడివాడ వర్గాలుగా విడిపోయి జనసేన శ్రేణులు బాహాబాహీకి యత్నించాయి. బోలిశెట్టి సత్యనారాయణపై కొందరు కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. మనోహర్ బస చేసిన చోటే రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో కొందరు కార్యకర్తలు మనోహర్‌ను బూతులు తిడుతూ కనిపించారు.
వారాహి యాత్రలో స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తణుకు సీటు జనసేనదేనని.. రామచంద్రరావు పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా చాలా కాలం దాకా ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. సీన్ కట్ చేస్తే.. ఉమ్మడి జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. టికెట్ టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు వెళ్లింది. దీంతో రామచంద్రరావు వర్గీయులు రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment