సాక్షి, అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌లో అన్ని పరిశ్రమల శంకుస్థాపనలు, అంతకు ముందు వాటికి భూసేకరణలు, కేటాయింపులు, అన్ని రకాల అనుమతులు వంటి పనులన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని టీడీపీ అనుకూల పత్రికలు రాసుకోవడం వల్ల ఏం ప్రయోజనమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నిలదీశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బాబు చివరి పాలనా కాలం 2014 – 2019 లోనే అన్ని జరిగిపోయాయి అని రాశారని పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత మూడున్నరేళ్లుగా ఏపీలో ఏ మూలన ఏ ఫ్యాక్టరీ లేదా పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభ కార్యక్రమానికి హాజరైనా వెంటనే తప్పుడు కథనాలను సంధిస్తాయని, బాబు ఆధ్వర్యంలో అప్పుడు జరిగిన ‘నిర్మాణాత్మక’ శంకుస్థాపన కార్యక్రమాలను పాఠకులకు గుర్తుచేస్తాయని తెలిపారు. ఈ తంతు ఎల్లో మీడియాకు ఒక ఆనవాయితీగా మారిపోయిందని తెలిపారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన రామ్ కో సిమెంట్స్ కర్మాగారాన్ని బుధవారం బజర్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారని, ఈ వార్తతో పాటే చంద్రబాబు కీర్తి కిరీటాన్ని చంద్ర మండలం దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేసేలా.. ఓ కథనాన్ని ఆ పత్రికలు ప్రచురించాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ కర్మాగారం శంకుస్థాపన టీడీపీ హయాంలోనే జరిగిందని పెద్ద పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చామనే రీతిలో రెచ్చిపోయి రాశాయని ఎద్దేవా చేశారు.
ఒక రాష్ట్రంలో ఐదేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన రాజకీయ పక్షం పాలనా కాలంలో అనేక కంపెనీలు ప్లాంట్లు పెట్టేందుకు శ్రీకారం చుట్టడం సర్వసాధారణమని, ఈ లోగా ఎన్నికలొచ్చి పాలకపక్షం మారితే.. కొత్త పాలక పార్టీ హయాంలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించడం కూడా మామూలు వ్యవహారమేనని తెలిపారు.
2019 మే 30 నుంచి వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా అనేక కంపెనీల్లో ఉత్పత్తి మొదలైందని, ప్రారంభ కార్యక్రమాలు సీఎం చేతుల మీదుగా జరిగాయని తెలిపారు. ఈ సాధారణ పారిశ్రామిక ప్రక్రియను ఈ పత్రికలు రెండు దశలుగా విభజించి, చంద్రబాబు హయాంలో శంకుస్థాపన, సీఎం జగన్ హయాంలో ప్రారంభం అంటూ పాఠకులకు కొత్త పాఠాలు చెబుతూ.. నవ్వుల పాలవుతున్నాయని ఎద్దేవా చేశారు.
అన్ని ఫ్యాక్టరీలకూ చంద్రబాబు హయాంలోనే శంకుస్థాపనలా?
Published Fri, Sep 30 2022 4:25 AM | Last Updated on Fri, Sep 30 2022 4:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment