సాక్షి, విశాఖపట్నం: పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. సింహాచలం భూముల పరిరక్షణకు ప్రహారీగోడ నిర్మిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, అందుకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘మాన్సాస్ ట్రస్ట్‌లో 14 వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మాన్సాస్ ట్రస్ట్‌లో 14 విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. పదేళ్లుగా ఆ విద్యాసంస్థల్లో ఆడిటింగ్ జరగలేదు. ఆడిటింగ్‌లో అవకతవకలు ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. ట్రస్టు భూములను అమ్మాలంటే కోర్టు అనుమతి ఉండాలని, నిబంధనలు పట్టించుకోకుండా దొంగ జీవో తీసుకొచ్చి భూములను అమ్మారని గత టీడీపీ ప్రభుత్వ తీరును విజయసాయిరెడ్డి విమర్శించారు. భూ ఆక్రమణలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అశోక్‌గజపతిరాజు దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి వెల్లంపల్లి
ఇక దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ అశోక్‌గజపతిరాజు దిగజారి మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాల అభివృద్ధి గుర్తుకు రాలేదా?. కుల, మతాల ప్రస్తావన తీసుకొచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దేవాదాయ భూములను చంద్రబాబు పప్పుబెల్లాలా పంచేశారు. దేవాదాయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. సింహాచలం భూముల పరిరక్షణకు ప్రహారీగోడ నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment