రూ.వందల కోట్లు కైంకర్యం
వందలాది ఎకరాలభూముల ఆక్రమణ
నకిలీ ఎరువులతో రైతులను నట్టేట ముంచిన వైనం
రేషన్, ఇసుక, అక్రమ మద్యం మాటున అక్రమార్జన
ఉపాధి హామీ, నీరు చెట్టు, సీసీరోడ్ల పేరుతో ప్రజాధనం లూటీ
మరుగుదొడ్ల బిల్లుల్లోభారీగా చేతివాటం
అభివృద్ధి పనుల్లోనూ మాయాజాలం
వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అవినీతి చిట్టా
సాక్షి, నరసరావుపేట/వినుకొండ/నూజెండ్ల: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘జీవీ’ నీరు–చెట్టు, ఇసుక, మట్టిని అడ్డంగా దోచేశారు. బంధువులు, బినామీల ద్వారా పోరంబోకు, అగ్రహారం భూములను కబ్జా చేశారు. పేదలకు ప్రభుత్వం అందించిన భూములను స్వాహా చేసి చేపల చెరువుల తవ్వకాలు చేపట్టారు.
♦ బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెంలో 4,450 ఎకరాల కొత్త చెరువులో సర్వే నం.438లో 180 ఎకరాలు జీవీ బావమరిది కె.నరసింహారావు బినామీల ద్వారా ఆక్రమించుకున్నారు.
♦ గుమ్మనంపాడులో ఈనాం భూములను జీవీ, ఆయన బినామీలు వదలలేదు. పాలడుగు వెంకటరాయుడు, చిరుమామిళ్ల రామకృష్ణయ్య అగ్రహారికులుగా వ్యవహరిస్తున్న సమయంలో వారి పరిధిలో సర్వే నంబర్ 1 నుంచి 54 వరకు 5,968 ఎకరాల భూమి ఉంది. ఇందులో దేవుని మాన్యం భూమి సర్వే నం.43లో చెన్నకేశవస్వామి భూమి 200 ఎకరాలు, బంగారమ్మ తల్లి భూమి 16 ఎకరాలు, ఆంజనేయ స్వామి మాన్యం 13 ఎకరాలు, మరో కబ్జాలో భాగంగా ఊరచెరువు కింద 17 ఎకరాలను ఆక్రమించుకున్నారు.
♦ రేమిడిచర్ల గాలెయ్యకుంట సమీపంలోని ఎస్సీ భూములను గుంటూరుకు చెందిన జీవీ అనుచ రుడు కృష్ణ 110 ఎకరాలు చౌకగా చేజిక్కించుకున్నారు. బొల్లాపల్లి మండలంలోనే జీవీ బంధువులు, బినామీలు ఆక్రమించుకున్న భూము ల విలువ రూ.వందల కోట్లకు పైగా ఉంటుంది.
కొప్పుకొండలో కబ్జా పర్వం
వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ పరిధి కొప్పుకొండలోని వాగు పోరంబోకు భూములను 1940లో బ్రిటీష్ ప్రభుత్వం మత్స్య సహకార సంఘానికి పంపిణీ చేసింది. 1980లో అదే గ్రామానికి చెందిన రైతుల నుంచి 17.80 ఎకరాల భూమిని జేవీఎస్ ఆక్వా కల్చర్ రాజ్యలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది.
జీవీ మేనమామ, ఒంగోలు వెంకటేశ్వర్లు, మరో బినామీ రామకోటేశ్వరరావును అడ్డుపెట్టుకొని చుక్కల భూమిగా ప్రకటించి ఈ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూముల చుట్టూ మూడు కిలోమీటర్ల మేర దాదాపు 25 చేపల చెరువులను అక్రమంగా సాగు చేస్తున్నారు. ఖాతా నం.585లో 136 ఎకరాలు, ఖాతా నంబరు 571లో 30 ఎకరాలతోపాటు సర్వే నంబరు 281లో మరికొంత భూమిని కలిపి సుమారు 300 ఎకరాల పోరంబోకు భూములను కబ్జా చేశారు. వీటి విలువ రూ.50 కోట్లు.
శివశక్తి పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా
శివశక్తి బయో కంపెనీ పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. రైతులకు అందించే సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం సల్ఫేట్, జింకు, బోరాన్, ఫెర్రస్ సల్ఫేట్ కొనుగోలుకు అప్పట్లో ప్రభుత్వం టెండర్లు వేయగా వరుసగా నాలుగేళ్లు కిలో రూ.35 లు, జీఎస్‌టీ లేకుండా రూ.28తో మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
మల్టినేషనల్ కంపెనీలైన కోరమండల్, నాగార్జున, టాటా వంటి కంపెనీలు ఎరువులు తయారు చేస్తున్నప్పటికీ ప్రాచుర్యం లేని శివశక్తి కంపెనీకి టెండర్లను మార్క్‌ఫెడ్ ఖరారు చేసింది. ఏటా రూ.33.97 కోట్లు అదనంగా రాయితీ పొందింది.
ఇలా నాలుగేళ్లు దాదాపు రూ.100 కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో బొక్కేశారు. శివశక్తి బయో టెక్నాలజీ లిమిటెడ్, విజయ గ్రోమిన్, నవభారత్ పలు కంపెనీల పేర్లతో నెల్లూరు జిల్లా వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి, కర్నూలు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల్లో నకిలీ బయో ఎరువులు విక్రయించి రైతులను మోసగించారు.
ఉద్యాన సబ్సిడీ స్వాహా
ఉద్యాన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు అమలవుతున్న సబ్సిడీని రూ.10 కోట్లకు పైగా జీవీ స్వాహా చేశారు. వెల్లటూరు, మేళ్లవాగు, వడ్డెంగుంట, చీకటీగలపాలెం ప్రాంతాల్లో టమాటా, బొప్పాయి, పుచ్చ, నిమ్మ పంటలకు షేడ్‌నెట్, పాలి హౌస్, కూరగాయల పందిళ్ల పేరుతో వచ్చే సబ్సిడీని ఆయనే కైంకర్యం చేశారు. నూజెండ్ల, ఈపూరు మండలాల్లో మిర్చి రైతులు నష్టపోవడంతో రైతులకు ఇచ్చిన పరిహారాన్ని కాజేశారు. జీవీ అనుచరులు, బినామీలు బొల్లాపల్లి, వినుకొండ, రూరల్ మండలాల్లో ఉన్న అప్పటి అధికార పార్టీ నాయకులు రేషన్ మాఫియాగా ఏర్పడి రూ.200 కోట్లు దోపిడీ చేశారు.
గుండ్లకమ్మలో ఇసుక దందా, ఉపాధి హామీ పనులు, నీరు చెట్టు పనులు, చెక్‌డ్యామ్‌లు, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పేరుతో కోట్లల్లో స్వాహా చేశారు. ఈ అక్రమాలపై అప్పటి ఎంపీడీవో రవికుమార్‌తో పాటు 9 మంది ఉపాధి హామీ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. 2014లో నూజెండ్ల మండలం మూర్తింజాపురంలో 10 గ్రామాలకు తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణంలో అవినీతి జరిగింది. పనులు నాసిరకంగా చేయడంతో చెరువు నీరు నింపే క్రమంలోనే చెరువుకట్ట కొట్టుకుపోయింది.
ఎన్‌ఎస్‌పీ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా నాగార్జున సాగర్ మేజర్, మైనర్ కెనాల్స్ పనులు నాసిరకంగా చేపట్టి రూ.90 కోట్లు వెనకేసుకున్నారు. వినుకొండలో తాగునీటి సమస్య నెలకొనడంతో మంచినీటి సరఫరా కోసం రూ.2 కోట్లు మంజూరైంది. మంచినీటి ట్యాంకర్ల పేరుతో రోజూ లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులను దోచుకున్నారు. ఈపూరు మండలంలోని ఊడిజర్ల గ్రామ మరుగుదొడ్ల లబి్ధదారులకు తెలియకుండా రూ.35 లక్షల మేర దోచుకున్నారు.
15 ఎఫ్‌ఐఆర్‌లు
తన వ్యాపార భాగస్వామిని హత్యచేయించడంలో జీవీపై కేసు నమోదైంది. తర్వాత హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులను బెదిరించి కేసులను రాజీ చేసుకొని 2009 ఎన్నికల్లో వినుకొండ నుంచి పోటీ చేశారు. జీవీపై ఇప్పటివరకు దౌర్జన్యం, ప్రభుత్వ విధుల నిర్వహణకు ఆటంకం తదితర నేరాలపై 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో తొమ్మిది, శావల్యాపురం 3, ఈపూరు, బండ్లమూడి, సత్తెనపల్లి ఒక్కో కేసు నమోదైంది. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి.
♦ వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెందిన వల్లభ డెయిరీలోకి జీవీ అనుచరులతో చొరబడి వస్తువులను ద్వంసం చేశారు. దీనిపై వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో జీవీపై 25–7–2023న క్రైం నంబర్ : 163/23తో 143, 447, 379, 506 రెడ్‌విత్ ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.
♦ వినుకొండలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిబంధనలు అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించినందుకు జీవీపై వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో 17–5–2023న క్రైం నంబర్ 130/23తో 143, 341, 188, రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.
♦ ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేసి పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు ఈపూరు పోలీస్ స్టేషన్లో జీవీపై 12–12–2021న క్రైం నంబర్ 169/2021తో 341, 353 రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment