సాక్షి,మంచిర్యాల: నాయకులు పార్టీ మారడం సాధారణంగా జరిగేదే. ఓ నేత పార్టీలు మారుతూ జనాన్ని కన్‌ఫ్యూజ్‌లోకి నెట్టేస్తుంటారు. అందుకే ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో విజయాన్ని చూడలేదు. తాజాగా మరోసారి పార్టీ మారారు. ఈసారి తనకొడుకును బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. గతంలో తండ్రిని ఓడించిన అధికార పార్టీ నాయకుడు ఈసారి ఆయన తనయుడిని కూడా ఓడిస్తానంటున్నారు. ఇంతకీ అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఆ నాయకులెవరో చూద్దాం.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి గులాబీ పార్టీలో పేరు తెచ్చుకున్న బాల్క సుమన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. విద్యార్థి నేతగా ఉద్యమంలో చురుగ్గా ఉన్నకాలంలోనే రాష్ట్రం ఏర్పాటైనపుడు 2014లో పెద్దపల్లి నుంచి గులాబీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో చెన్నూరు నుంచీ అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా చెన్నూరు నుంచే పోటీ చేస్తున్నారు సుమన్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఈసారి చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈసారి అసెంబ్లీ బరిలో వివేక్ నిలబడకుండా ఆయన తనయుడు వంశీతో రాజకీయం అరంగేట్రం చేయిస్తారని తెలుస్తోంది.
వ్యాపారరంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న గడ్డం వివేక్..రాజకీయాల్లో తత్తరపాటు నిర్ణయాలతో ఓటమిపాలవుతున్నారనే టాక్ నడుస్తోంది. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్న వివేక్ 2009లో ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాటం జరుపుతున్నా తెలంగాణ ఇవ్వడంలేదని కాంగ్రెస్ మీద కోపం వచ్చి ఆనాడు గులాబీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించాక కృతజ్ఞతతో మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ తరపున ఎంపీ సీటుకు పోటీ చేసి బాల్క సుమన్ మీద ఓడిపోయారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2016లో మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కాని.. గత ఎన్నికల్లో కేసీఆర్ సీటు ఇవ్వనందుకు కోపం వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో బీజేపీకి రాజీనామా చేసి మరోసారి సొంతగూటికి చేరుకున్నారు గడ్డం వివేక్.
లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి పెద్దపల్లి నుంచే బరిలోకి దిగాలనుకుంటున్న గడ్డం వివేక్...అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడు వంశీకృష్ణకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో తనను ఓడించిన బాల్క సుమన్ మీద చెన్నూరులో పోటీ చేయడానికి తనయుడిని సిద్ధం చేస్తున్నారట వివేక్. తండ్రిని ఓడించిన సుమన్‌ను ఓడించి అసెంబ్లీలో ప్రవేశించడానికి వివేక్ తనయుడు వంశీకృష్ణ రెడీ అవుతున్నారని టాక్. అయతే గతంలో ఒకసారి తండ్రిని ఓడించి ఎంపీగా గెలిచాను...ఈసారి కొడుకును ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అవుతానంటున్నారు గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్. తండ్రీ, తనయులను ఓడించి చరిత్ర కెక్కుతానంటున్నారు బాల్కసుమన్.
ఎన్నికల వేళ రాజకీయాల్లో కోలాహలం మామూలే. రాత్రి ఒక పార్టీ.. ఉదయం మరోపార్టీ మారే నాయకులు మనకు అనేకమంది కనిపిస్తారు. ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ మారే నేతల్ని మనం చూస్తున్నాం. గడ్డం వివేక్ ఈసారైనా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందే అని భావిస్తున్నారా? వివేక్ నిర్ణయం కరెక్టా? కాదా అన్నది చెన్నూరు ప్రజలే తేలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment