
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తారనే నమ్మకంతోనే ఇక్కడి కూటమి అభ్యర్థులను గెలిపించారని.. అలాంటిది ఆ చిత్తశుద్ధిని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకోలేకపోతోందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక(FDNA) ఆరోపిస్తోంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఎఫ్‌డీఎన్‌ఏ జనరల్ సెక్రటరీ ఆజశర్మ పేరిట బహిరంగ లేఖ రాసింది.
‘‘గత ఎన్నికల్లో గెలిస్తే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మీ హామీని నమ్మి మీకు అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారు. మీ మాటలను నమ్మి గాజువాక ఎమ్మెల్యే, విశాఖ ఎంపీను అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు.
.. మీరు ప్రధాని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం కనీసం ప్రస్తావించలేదు. అమరావతిలో స్టీల్ ప్లాంట్ నాయకులను గంటలకొద్దీ నిరీక్షించేలా చేశారు. పైగా స్టీల్ ప్లాంట్ కు లాభాలు తీసుకురండి.. ఆ తరువాత సంగతి చూద్దామని చెప్పారు. ఓపక్క కేంద్రం ఉద్దేశపూర్వకంగా ముడిసరుకు సరఫరా లేకుండా పీక నులిమేస్తోంది. అలాంటప్పుడు లాభాలు ఎలా వస్తాయి?. మీ తీరు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వంత పాడుతున్నట్లు కనిపిస్తోంది.
మీరు ఇచ్చిన హామీకి మీరే తిలోదకాలు ఇస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉంది. పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే చరిత్ర క్షమించదు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీ నిజాయితీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని లేఖ ద్వారా పవన్, చంద్రబాబులను కోరింది ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక.

ఇదీ చదవండి: అగమ్యగోచరం.. స్టీల్‌ప్లాంట్ భవితవ్యం
Comments
Please login to add a commentAdd a comment