న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. ఫలితాలు తమ అంచనాలకు భిన్నంగా వచ్చాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతిని ధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అంతమాత్రాన ధైర్యం కోల్పోలేదని, పోరాడి విజయం సాధిస్తామని చెప్పారు. ఫలితాల అనంతరం గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలతో నిరాశ చెందినా కుంగిపోలేదని చెప్పారు. ‘‘ఓటమి కారణాలపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఒక పార్టీగా కాంగ్రెస్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. సరికొత్త వ్యూహాలతో తిరిగొస్తుంది. గెలిచేదాకా పోరాడుతూనే ఉంటుంది. ఆ క్రమంలో నిత్యం జనం పక్షానే నిలుస్తుంది.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ప్రజా సమస్యలపై అంతే బాధ్యతతో గొంతెత్తుతుం ది’’ అని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కుల, మతవాదాలకు తావివ్వకుండా చూసేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసినా బీజేపీ చేసిన విపరీతమైన భావోద్వేగ ప్రచారం ముందు విద్య, వైద్యం, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలు పక్కకు పోయాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో మెరుగైన ఫలితాలు ఆశించినట్టు సుర్జేవాలా చెప్పారు. కానీ పంజాబ్‌లో ప్రభు త్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయామన్నారు. ‘‘యూపీలో పార్టీకి నూతన జవసత్వాలు కల్పించగలిగినా ప్రజల్లో తమ పట్ల ఉన్న సానుకూలతను ఓట్లుగా మార్చుకోలేకపోయాం. ఉత్తరాఖండ్, గోవాల్లో బాగా పోరాడినా విజయం సాధించలేకపోయాం’’ అని చెప్పారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్నారు.
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం సాగిస్తాం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రజల తరపున నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. యూపీలో విజయం కోసం తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో శ్రమించారని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం ఉద్యమించారని తెలిపారు. అయినప్పటికీ తమ శ్రమను ఓట్లుగా మరల్చుకోలేకపోయామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పు శిరోధార్యం అని ఉద్ఘాటించారు. యూపీ అభివృద్ధి కోసం తమ వంతు పోరాటం సాగిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment