సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలతో గ్యారెంటీ కార్డును రూపొందిస్తామని.. ఆ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయడం ద్వారా అధికారంలోకి వచ్చాక హామీలను నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజల్లో కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పారు. సెప్టెంబర్ 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలన్న ప్రతిపాదన ఉందని.. ఒకట్రెండు రోజులు అటూఇటూగా మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు.
సోమవారం గాం«దీభవన్‌లో రోహిత్‌చౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఫహీంలతో కలసి ఠాక్రే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీపరంగా అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నామని, తాము అధికారంలోకి వస్తామని వాటిలో స్పష్టంగా వెల్లడవుతోందని చెప్పారు. రోజురోజుకూ బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతోందని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ గ్రాఫ్ మరింత దిగజారుతుందని పేర్కొన్నారు.
‘‘తెలంగాణలో ఒక కారు తిరుగుతోంది. ఆ కారులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితలతోపాటు బీజేపీ కూడా కలసి ప్రయాణం చేస్తోంది..’’ అని ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. త్వరలోనే బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను ప్రకటిస్తామన్నారు.
‘లెఫ్ట్’కు తలుపులు మూయలేదు
లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశంపై ఠాక్రే మాట్లాడారు. ‘‘లెఫ్ట్ పార్టీలతో మేం మాట్లాడాం. వారు మాతో మాట్లాడారు. కానీ ఇదంతా అనధికారికమే. అధికారికంగా ఇంకా చర్చలు ప్రారంభం కాలేదు. లెఫ్ట్ పార్టీలకు మా తలుపులు మూసి ఉంచలేం. ఎందుకంటే వారు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కాదు. ఇండియా కూటమిలో భాగస్వాములు. అయినా వారితో చర్చలు జరపాల్సింది నేను కాదు.
పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత వారితో చర్చిస్తారు. అప్పుడే చర్చలు అధికారికంగా ప్రారంభమైనట్టు లెక్క. అప్పటివరకు వచ్చే వార్తలన్నీ ఊహాగానాలే..’’ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విషయం గురించి రాష్ట్రస్థాయిలోని తమకు అవగాహన లేదన్నారు. వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment