కోలకత : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి కాలుతోనే బెంగాల్‌ను గెలుచుకుంటానని శపథం చేసిన కలకత్తా కాళి మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. దాదాపు 200కు పైగా స్థానాల్లో లీడింగ్‌లో నిలిచిన టీఎంసీ బీజేపీకి గట్టి షాకే ఇస్తోంది. మరోవైపు బెంగాల్‌లో దీదీకే మళ్లీ పట్టం అని పదే పదే నొక్కి వక్కాణించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ 100 శాతం నిజమైంది. ఈ సందర్బంగా గతంలో పీకే ట్వీట్లు ఇపుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
తాజా ఫలితాల సరళి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ స్పందించారు. మోదీ పాపులర్ వ్యక్తి అయినంత మాత్రానా బీజేపీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి తీరాలన్న గ్యారంటీ ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. టీఎంసీకి విజయం ఏకపక్షమే అయిన తీవ్ర పోటీ ఎదురైందన్నారు. ఎన్నికల కమిషన్ పాక్షికం వ్యవహరించి, తమ ప్రచారాన్నిఅడ్డుకుందని, దీంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని పీకే వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో గెలవబోతున్నామంటూ బీజేపీ భారీ ప్రచారాన్ని చేపట్టింది. అయినా ఊహించని విజయాన్ని ప్రజలు టీఎంసీ కిచ్చారంటూ పీకే సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు 294 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ డబుల్ డిజిట్ దాటడం కూడా కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21 ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నాయకులు పీకేపై మండిపడుతున్నారు. దీంతో బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం అధికారం నిబెట్టుకున్నా.. బీజేపీ సునామీతో ఒక ఎన్నికల వ్యూహకర్తను కోల్పోనుందని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా ట్వీట్ చేశారు.
కాగా గత సంవత్సరకాలంగా, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించినప్పటినుంచి మోదీషా ద్వయం బెంగాల్‌లో మమతను అధికార పీఠంనుంచి దూరం చేసేందుకు పావులు కదిపారు. కానీ బెంగాల్ ప్రజలు మాత్రం దీదీవైపై మొగ్గారు. అయితే గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకునేదశగా కదులుతోంది. ప్రస్తుతం 74 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. గత ఎన్నికల్లో 76 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఒక స్థానమైనా దక్కించుకుంటుందా అనేది ప్రశ్నార్థకమే.
Comments
Please login to add a commentAdd a comment