ఎన్నికల సమయాన ఐటీ, ఈడీ దాడులు మామూలే. ఇటువంటివన్నీ రాజకీయ ప్రేరేపిత దాడులే అన్నది ప్రతిపక్షాల మాట. ఈ దాడులన్నీ ప్రతిపక్షాల నేతలపైనే జరుగుతున్నాయని వారి వాదన. మరి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై జరిగిన ఐటీ దాడి ఆయనకు దడ పుట్టించిందా? లేదంటే దాడి రివర్సైందా? అభ్యర్థికి దడ పుట్టించాల్సిన ఐటీ దాడులు ఆయన విజయానికి బాటలు వేశాయా? కేంద్ర సంస్థల దాడులు వివేక్ మీద సానుభూతి పెంచాయా? ప్రజల్లో పలుచన చేశాయా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వివేక్‌కు హైదారాబాద్ లోని ఇల్లు, మంచిర్యాలలో ఆయన ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం నాడు తెల్లవారుఝాము నుంచి రోజంతా ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివేక్ అనుచరులు నగదు పంచుతున్నారని... ఆయన ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయనే అనుమానంతో పదిహేను మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వివేక్ వెంకటస్వామికి వివిధ కంపెనీల నుండి నగదు వచ్చిందన్న సమాచారంతో వచ్చిన అధికారులు ఆ లావాదేవీలపై సోదాలు జరిపారు.
ఐటీ దాడుల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. తాను చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక ఈ దాడులు జరిగాయని ఆయన అంటున్నారు. తనపై బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న బాల్క సుమన్ కుట్రతోనే కేంద్ర సంస్థలతో దాడులు చేయించారని వివేక్ ఆరోపించారు. తనను ప్రజల్లో పలుచన చేయాలనే కుట్రతోనే, తనను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని అన్నారు. మేము తప్పుడు మార్గాలలో ధనాన్ని తరలించలేదన్నారు. సుమన్ తప్పుడు ఫిర్యాదుతోనే ఇదంతా జరిగిందన్నారు. ఈ దాడుల వెనుక బిజెపి బిఅర్ఎస్ పార్టీల హస్తం ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని..ఐటీ దాడులతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి రుజువు చేసుకున్నారని కామెంట్ చేశారు వివేక్.
ఆదాయప్ను ఆధికారులు దాడులు నిర్వహిస్తున్న ఇంటి దగ్గర..చెన్నూరులోనూ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీ దాడులు వివేక్ వెంకటస్వామిపై ప్రజల్లో సానుభూతి పెంచిందనే చర్చ చెన్నూరు నియోజకవర్గంలో సాగుతోంది. ప్రజల్లో వివేక్‌పై ఏర్పడ్డ సానుభూతి, పెరిగిన ఆదరణ ఆయనకు ఓట్ల వర్షాన్ని పెంచుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఇక ఆయన విజయానికి ఢోకా లేదని భావిస్తున్నారు. అయితే వివేక్ ఇంటిపై ఐటీ దాడులు జరగడంలో సుమన్ హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిచింది. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు.
ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. కొన్నిసార్లు కొన్ని వ్యూహాలు బెడిసికొడుతుంటాయి. కొన్ని విజయవంతమవుతాయి. మరి కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో అసలు నిజాలు ఎలా ఉన్నా... వీటి వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందా? ఇబ్బంది కలుగుతుందా అనేది ఫలితాల రోజే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment