Who Is Eknath Shinde, Minister At Heart Of Crisis For Team Thackeray - Sakshi
Sakshi News home page

Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవ‌రీ ఏక్‌నాథ్ షిండే?

Published Tue, Jun 21 2022 3:13 PM | Last Updated on Tue, Jun 21 2022 6:05 PM

Who Is Eknath Shinde Minister At Heart Of Crisis For Team Thackeray - Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయం వేడేక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన రగడ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. తాజాగా అధికార మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వానికి చెందిన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. శివ‌సేన నేతృత్వంలోని కూట‌మి కుప్పకూలనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా బీజేపీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా ఆచితూచి ముందుకు సాగుతోంది. 

అగ్రనేత ఏక్‌నాథ్‌ షిండే 
కాగా మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఎక్‌నాథ్‌ షిండే.. శివసేన పార్టీలో అగ్ర నాయకుడు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు నమ్మిన బంటు. ప్రస్తుతం మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు. అయితే షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 
సంబంధిత వార్త: Maharashtra Political Crisis:శివ సేనలో చీలిక.. డేంజర్‌లో మహా సర్కార్!?

నాలుగుసార్లు ఎమ్మెల్యే
ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగు పర్యాయాలు (2004, 2009, 2014, 2019) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.  థానే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు.

సూరత్‌ రిసార్ట్‌లో మకాం
ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిన షిండే జాడ తెలిసింది. గుజరాత్‌ సూరత్‌లోని ఓ రిసార్ట్‌లో తన 10 మంది ఎమ్మెల్యేలతో ఉన్నట్లు తెలిసింది. వీళ్లంతా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. అయితే ఈ మధ్యాహ్నం తన ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్‌ షిండే అజ్ఞాతం.. ప్రస్తుతం ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడినట్లు కనిపిస్తుంది. షిండే ఇటీవల మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి అయోధ్య పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు. 
చదవండి: Maharashtra Political Crisis:ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement