జార్ఖండ్ రాజకీయాలు రోజరోజుకీ ఉత్కంఠగా మారాయి. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నించడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన భార్య కల్పనా సోరెన్ పేరు తెరమీదకు వచ్చింది.
సోరెన్ అరెస్ట్ అయితే కల్పనా తదుపరి జార్ఖండ్ సీఎం అవుతారని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో తనను ఈడీ అరెస్ట్ చేస్తే భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని హేమంత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల సమావేశంలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
హేమంత్ సోరెన్.. తన భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే వ్యాఖ్యలు చేయడం ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తున్నాయి. ఒకవేళ అవినీతి కేసుల వల్ల హేమంత్ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే.. పార్టీలో పూర్తిగా చక్రం తిప్పేది కల్పనయే.
ఎవరీ కల్పనా
కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. ఆమె రాజకీయంగా ఎలాంటి పదవిలో లేరు. కానీ పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. రాజకీయాల్లో హేమంత్‌కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది. కల్పనా ముఖ్యమంత్రి పదవిని చేపడితే... ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఓ ట్విట్స్ ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం ఇంకా ఏడాది కంటే తక్కే ఉంది. ఈ సమయంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేకపోవచ్చు. మరి ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సి ఉంది.
సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ
ఇక ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన కల్పన 1976లో రాంచీలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యూయెట్ చేసిన కల్పనా తరువాత ఎంబీఏ చేశారు. ఫిబ్రవరి 7, 2006న హేమంత్ సోరెన్‌ను వివాహం చేసుకుంది. వీరికి నిఖిల్, అన్ష్ ఇద్దరు పిల్లలు. కల్పనా సోరెన్ ఒక పాఠశాలను నడుపుతుండటంతోపాటు సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తున్నారు.
చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్
2022లో వార్తల్లోకి
దాదాపు రూ. 5 కోట్ల ఖరీదు చేసే మూడు వాణిజ్య భవనాలు ఆమె పేరిట ఉన్నాయి. మహిళలు, పిల్లల సాధికారతపై కార్యక్రమాలకు కూడా తరుచుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే 2022లో తన భార్యకు(కల్పనా సోరెన్) చెందిన కంపెనీకి పారిశ్రామిక ప్రాంతంలో ప్లాట్‌ను కేటాయించేందుకు సోరెన్ తన పదవిని దుర్వినియోగం చేశారని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆరోపణలు చేయడంతో కల్పనా పేరు వార్తల్లో నిలిచింది.
30 గంటల తర్వాత ప్రతక్ష్యం
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం, మంగళవారం సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆయన 27వ తేదీ రాత్రి నుంచి అందుబాటులో లేకుండా పోవడంతో ఇంట్లో తనిఖీలు చేపట్టి రూ. 36 లక్షలతోపాటు బీఎండబ్ల్యూకారు, కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 30 గంటల తర్వాత సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం సాయంత్రం రాంచికీ చేరుకొని పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment