
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తెలంగాణ యాంకర్ శివజ్యోతి(జ్యోతక్క) యూ ట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె బీఆర్‌ఎస్‌కు ఎందుకు సపోర్ట్ చేస్తోందో వివరించింది. తాను ఎవరికి అమ్ముడు పోలేదని, తనకు నచ్చినది చెప్తున్నానని క్లారిటీ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడాన్ని ఆమె అంశాల వారిగా వివరిస్తూ సమర్థించుకున్నారు. నువ్వెందుకు బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నావని తిడుతున్న వారి కోసమే వీడియో పెడుతున్నానని తెలిపింది.
‘సర్కార్‌తో హ్యాపీగా ఉన్నామని దేశంలో తెలంగాణ రైతులు మాత్రమే చెబుతున్నారు. కరెంటు లేకపోతే అప్పట్లో పరిస్థితులు దారుణంగా ఉండె. అప్పులు కట్టలేనన్న రైతుల ఇండ్ల తలుపులు పీక్కుపోయిన ఘటనలున్నాయి. కరెంటే లేకపోతే ఫోన్‌ల చార్జింగ్‌లు ఎట్ల పెట్టుకునేటోళ్లం. యూ ట్యూబ్‌ల వీడియోలు ఇట్ల చూస్తుంటిమా. కళ్యాణలక్ష్మి ఇచ్చిందెవరు కేసీఆర్ సార్ కాదా. నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య ఎప్పుడు పరిష్కారమైంది. ఎవరు పరిష్కారం చేశారు’ అని జ్యోతక్క ప్రశ్నించారు.
‘పెద్దకొడుకు లెక్కముసలోల్లకు రూ.2016 పెన్షన్లు ఇచ్చింది కేసీఆర్ సార్ కాదా. ఉద్యోగాలివ్వాలని అడిగితే పెన్షన్ల గురించి ఎందుకు చెబుతున్నావని కొందరు అడుగుతున్నారు. అందరికీ ఉద్యోగాలు రావు కదా. ఉద్యోగాలు రాని వాళ్ల తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి. మార్పు రావాలి అని అంటున్న వాళ్లతో 60 ఏళ్లు వెనక్కి పోతాం. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుక్కుంటున్నరు. ముఖ్యమంత్రి పదవి కోసం కాదా వాళ్ల తాపత్రయం. వాళ్ల మోసాన్ని గమనించకుండా ఉద్యోగాల కోసం మార్పు కావాలనుకుంటే కరక్టేనా. దేశంలో అన్ని స్టేట్‌లలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది కేసీఆర్ సర్కారు కాదా’ అని జ్యోతక్క ప్రశ్నించారు.
‘కేసీఆర్ సారు రాజకీయాల్లో ఉన్నంత కాలం సారే సీఎం కావాలి. సార్ ఒక్క హ్యాట్రిక్ కాదు ఎన్నో హ్యాట్రిక్‌లు కొట్టాలి. మేమే ఇచ్చినం కదా అనేటోళ్లు ఎప్పుడిచ్చిండడ్రో ఆలోచించుకోవాలి. స్వాతంత్రం ఇచ్చిన బ్రిటీష్ వాళ్లు గొప్పోళ్లా సాధించుకున్న మనం గొప్పోళ్లమా. సార్ ఒక్క ఛాన్స్ కావాలని అడగలే సావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినందుకు, అభివృద్ధి చేసినందుకే నేను బీఆర్‌ఎస్ పార్టీ సైడున్న. నెగెటివ్ కామెంట్లు పెట్టినా, ట్రోల్ చేసినా సరే మీరు బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయండి అని కోరతాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అని జ్యోతక్క కోరారు.
Comments
Please login to add a commentAdd a comment