మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలుపు ద్వారా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పతనానికి నాంది పడుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడమంటే.. కేవలం ఒక్క నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం కాదని, ఇది కేసీఆర్ అవినీతి ప్రభుత్వ అంతానికి మార్గం వేయడమని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా ఆదివారం మునుగోడు పట్టణంలో బీజేపీ ‘మునుగోడు సమరభేరి’బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ప్రసంగం అమిత్‌షా మాటల్లోనే..
కేసీఆర్ సర్కారును కూకటివేళ్లతో పెకలిస్తాం..
‘‘మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం పతనానికి నాంది పడుతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి గంగానది ప్రవాహంలా ముందుకు సాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారు.
కేసీఆర్ మజ్లిస్‌కు భయపడుతున్నారు
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కారణంగా రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్న కేసీఆర్ మాట తప్పారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ఈ హామీ అమలు చేయడం లేదు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తాం.
నిరుద్యోగ భృతి.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవి?
కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు. నల్లగొండలో నిర్మించారా? పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇళ్లు ఇవ్వకపోగా.. కేంద్ర ప్రభుత్వం నిర్మించే మరుగుదొడ్ల పథకాన్ని కూడా కేసీఆర్ అడ్డుకుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే.. కేటీఆర్‌ను సీఎం చేస్తారే తప్ప దళితుడిని చేయరు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళిత బంధు కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఎందరికి ఇచ్చారు? ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది? గిరిజనులకు భూమి ఇస్తామన్న హామీ ఏమైంది? యువతకు ఉద్యోగాలు ఇస్తామని 2014 నుంచీ చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, ఇతర బంధువులకు మాత్రమే ఉపాధి కల్పించుకున్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే మాకు బాధ లేదు. కానీ ఆ కుటుంబ అరాచక పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధపడాలి, ఎందుకు నష్టపోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది.
రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించరేం?
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను రెండు సార్లు తగ్గించినా కేసీఆర్ సర్కారు తగ్గించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. మోదీ సర్కారు రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా.. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఎందుకు ఉంది? టీఆర్‌ఎస్ సర్కారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో కమలం వికసించేలా చేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లోనే ఉంది..’’అని అమిత్‌షా పిలుపునిచ్చారు. కాగా సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతం చేయాలని.. మునుగోడు ఉప ఎన్నికలే ఇందుకు నాంది పలకాలని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు గొంగిడి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మునుగోడు సభలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, నేతలు విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా సభలో నేతలు
కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభమవుతుందని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నయవంచక కుటుంబం చేతిలో చిక్కి విలవిల్లాడుతోందని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్తు, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరానని.. ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
ఈ ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగేది కాదని.. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారేటప్పుడు చాలా మంది నేతలు నైతిక విలువలు వదిలేస్తున్నారని, తాను మాత్రం పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ ప్రతి ఎన్నిక సమయంలో బెదిరిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ‘హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీ గెలిచింది, మరి ఏ ఒక్క మోటార్‌కైనా మీటరు పెట్టారా?’అని ప్రశ్నించారు.
తెలంగాణలోని వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యను తీర్చేందుకు కేంద్రమే రూ.750 కోట్లు నిధులు ఇచ్చిందని.. అదేదో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను పరిష్కరించినట్టు చెప్పుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను అంతం చేయడానికే అమిత్‌షా మునుగోడుకు వచ్చారన్నారు. తాము రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు తాము సభ పెట్టామని, మరి టీఆర్‌ఎస్ మునుగోడులో సభ ఎందుకు పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. ‘కేసీఆర్ నీకు దురద పెడితే నువ్వే గోక్కో.. మమ్మల్ని గోకమనకు. కేసీఆర్‌కు సమాధానం చెప్పే సత్తా ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉంది’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
రూ.2 లక్షల కోట్ల సబ్సిడీ, ఫసల్ బీమా పథకంతో ప్రధాని మోదీ రైతులను ఆదుకుంటుంటే.. సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేయడం ఏమిటని ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత, గౌడ, ముదిరాజ్ తదితర అన్ని కులాల ప్రజలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మునుగోడు సభ జనం లేక వెలవెల బోయిందన్నారు.
కేసీఆర్‌కు వామపక్షాల మద్దతు సిగ్గుచేటని.. కమ్యూనిస్టుల గొంతు నొక్కి ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌కు మద్దతు ఎలా ఇస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిలదీశారు. ‘‘సీపీఐ, సీపీఎం నేతలు ఎనిమిదేళ్లుగా ఏనాడైనా ప్రగతిభవన్‌లో అడుగు పెట్టారా? మీ కార్మిక సంఘాలు సమ్మెలు చేసినప్పుడు మిమ్మల్ని చర్చలకు పిలిచి మాట్లాడారా? కమ్యూనిస్టు పార్టీలకు, ట్రేడ్ యూనియన్లకు అడ్డా ఇందిరా పార్కు. అలాంటి చోట ధర్నాలు చేసే అధికారం లేదని చెప్పి.. చైతన్యం ఉండకూడదని, ట్రేడ్ యూనియన్లు ఉండకూడదని చెప్పి నిషేధించిన కేసీఆర్ ఈ రోజు ప్రగతికాముకుడిగా కనబడుతున్నారా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని కేసీఆర్ బెదిరించి.. అనేక మంది డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలకు కారణమైనది మర్చిపోయారా? చివరికి ట్రేడ్ యూనియన్లు పెట్టుకోబోమని దండం పెట్టించుకున్న చరిత్రను మరిచిపోయారా?’’అని ఈటల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు మద్దతిచ్చేవారిని, కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునేవారిని తెలంగాణ ప్రజలు క్షమించబోరని వ్యాఖ్యానించారు.
చదవండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూ.ఎన్‌టీఆర్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment