లిప్‌స్టిక్ పెట్టుకునే ఆడ‌వాళ్ల‌ హంగామా మొదలు.. ఆర్జేడీ నేత వ్యాఖ్యలు | Women With Lipstick Exploit Womens Reservation Bill Said RJD Leader Abdul Bari Siddiqui - Sakshi
Sakshi News home page

లిప్‌స్టిక్ పెట్టుకునే ఆడ‌వాళ్ల‌ హంగామా మొదలు.. ఆర్జేడీ నేత వ్యాఖ్యలు

Published Sat, Sep 30 2023 4:15 PM | Last Updated on Sat, Sep 30 2023 5:06 PM

Women With Lipstick Exploit Womens Reservation Bill Said RJD Leader - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్‌స్టిక్‌లు బాబ్ కట్ చేసుకున్న మహిళలంతా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకొస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని నేతలు కూడా విభేదించారు. 

బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దిఖీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇకపై లిప్‌స్టిక్‌లు పెట్టుకునే ఆడవాళ్లు బాబ్ కట్ చేసుకునే ఆడవాళ్లు మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి హంగామా చేయడం మొదలు పెడతారు చూడండని వ్యాఖ్యానించారు. తర్వాత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ గ్రామస్తులకు అర్ధమయ్యే విధంగా చెప్పడం కోసం తాను  అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. మొదటి నుంచి ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తూనే ఉందన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల్లో కూడా ఆర్జేడీ బిల్లుకు మద్దతిచ్చిందని బిల్లులో ఓబీసీలను చేర్చకపోవడంపై మాత్రం తమ పార్టీ తీవ్రస్థాయిలో విభేదించిందని గుర్తుచేశారు.

అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌశల్ కిషోర్ స్పందిస్తూ.. దీనినిబట్టి ఆయన ఆలోచనలు ఎంత కింది స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతున్నాయన్నారు. మహిళలు చట్టాలను, రాజ్యాంగాన్ని బాగా అధ్యయనం చేసి ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించేందుకు వస్తున్నారు. ఒక కారుకు చక్రాలు ఉన్నట్టుగానే పార్లమెంటులో కూడా పురుషులు మహిళలు చట్టాలు చేయడంలో భాగస్వాములవుతారని.. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. 

సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వారు కూడా ఖండించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ.. మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఓబీసీల తోపాటు ఎస్సీ,ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారు కూడా రిజర్వేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లులో అంశాన్ని ఆర్జేడీ తోపాటు మిగతా పార్టీలు కూడా విభేదించాయి. సమాజ్‌వాది పార్టీ ఎంపీలు శరద్ యాదవ్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక స్వర్గీయ సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ అయితే ఇదే అంశంపై మాట్లాడుతూ ఈ బిల్లు వలన సంపన్న కుటుంబాల్లోని ఆడవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది తప్ప గ్రామస్థాయిలో మహిళలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని 2012 లోనే అన్నారు. 

ఇది కూడా చదవండి: ‘కేసీఆర్‌ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్‌లో ఉంటారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement