న్యూఢిల్లీ: ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్(Arvind Kejriwal) సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలను ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.
‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు.
‘ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మురికివాడలను కూల్చివేయాలని భావిస్తోంది. వారి స్థలాలను ఆక్రమించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ముందు మీ ఓట్లు కావాలి.. తర్వాత మీ స్థలం కావాలి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో ఢిల్లీలోని మురికివాడ ప్రజలకు కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించి ఇచ్చింది. ఢిల్లీ మహానగరంలో నాలుగు లక్షలకు మందికి పైగా మురికివాడల్లో ఉన్నారు. మీరు అది చేయాలంటే మీకు వెయ్యేళ్లు పడుతుంది’ అంటూ సెటైర్లు వేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో హోదా అనుభవించడం కోసం కాదని, ప్రజల హోదా పెంచడం కోసమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
మురికివాడల కంటే.. శీష్ మహల్‌లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువ
ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించిన సంగతి తెలిసిందే. నిన్న( శనివారం). ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్‌ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు.
మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment