శివసేన-ఎన్సీపీ మధ్య ముదురుతున్న వివాదం | Words Between Shiv Sena And NCP Over Name Change In Mumbai | Sakshi
Sakshi News home page

శివసేన-ఎన్సీపీ మధ్య ముదురుతున్న వివాదం

Published Mon, Jan 4 2021 3:31 PM | Last Updated on Mon, Jan 4 2021 5:24 PM

Words Between Shiv Sena And NCP Over Name Change In Mumbai - Sakshi

సాక్షి ముంబై : ఔరంగాబాద్‌ పేరును సంభాజీనగర్‌గా మార్చాలన్న అంశం దుమారం రేకెత్తిస్తుండగా మరోవైపు అహ్మద్‌నగర్‌ పేరును కూడా మార్చాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అహ్మద్‌నగర్‌ పేరును మార్చాలని షిర్డీ లోక్‌సభ ఎంపీ, శివసేన నాయకుడు సదాశివ్‌ లోఖండ్‌ డిమాండ్‌ చేశారు. ఈ రెండు డిమాండ్లు ఇప్పటివి కావని పాతవేనని ఆదివారం ఆయన మీడియాకు చెప్పారు. ఔరంగాబాద్‌ పేరును సంభాజీనగర్‌గా మార్చాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. దీంతో శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఎంపీ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే అహ్మద్‌నగర్‌ పేరును కూడా అంబికానగర్‌గా మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. (కాంగ్రెస్‌-సేన: అగ్గిరాజేస్తున్న ఔరంగాబాద్)

ఏళ్ల నుంచి డిమాండ్‌.. 
గత అనేక సంవత్సరాలుగా శివసేనతోపాటు హిందుత్వవాది సంఘటనలు అహ్మద్‌నగర్‌ పేరు అంబికానగర్‌గా మార్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు కొందరు ఆనంద్‌నగర్‌ పేరును సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అంశంపై అనేక ఆందోళనలు జరిగాయి. 70వ సాహిత్య సమ్మేళనం సందర్భంగా అహ్మద్‌నగర్‌లో ఈ అంశంపై దుమారం లేచింది. ప్రతిసారి ఔరంగాబాద్‌ పేరు మార్పు అంశం తెరపైకి వచ్చిన వెంటనే అహ్మద్‌నగర్‌ పేరును మార్చాలన్న డిమాండ్‌ కూడా వస్తోంది. షిర్డీ ఎంపీ సదాశివ్‌ లోఖండే పలుమార్లు డిమాండ్‌ చేశారు. అహ్మద్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ అధికారంలో ఉండగా శివసేన ప్రతిపక్షంలో ఉంది. అహ్మద్‌నగర్‌ ఎమ్మెల్యే ఎన్సీపీ పార్టీకి చెందిన వారుండగా ఎంపీ బీజేపీకి చెందినవారున్నారు. ఇలాంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అహ్మద్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎలాంటి పాత్ర పోషించనుందనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఔరంగాబాద్‌ పేరు మార్పు అంశం మహావికాస్‌ ఆఘాడీలో చిచ్చుపెట్టేలా చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ రెండు అంశాలపై రాష్ట్రంలోని రాజకీయాలు ఎలా ఉండనున్నాయనే విషయంపై అందరిలో ఉత్కంఠ కన్పిస్తోంది.

పుణేనూ మర్చాల్సిందే.. 
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఔరంగాబాద్‌ పేరు మార్పు రగడ కొనసాగుతుండగా రాష్ట్రంలోని ఇతర నగరాల పేర్లు కూడా మార్చాలన్న డిమాండ్లకు ఊతం వచ్చింది. ఔరంగాబాద్‌ అనంతరం అహ్మద్‌నగర్, ఆ తర్వాత పుణే నగరం పేరు కూడా మార్చాలన్న డిమాండ్‌ విన్పిస్తోంది. పుణే పేరును జిజావు పూర్‌గా మార్చాలని సంభాజీ బ్రిగేడ్‌ డిమాండ్‌ చేసింది. సంభాజీ బ్రిగేడ్‌ పదాధికారి సంతోష్‌ షిండే ఈ డిమాండ్‌ చేశారు. విధ్వంసమైన పుణేను జిజావు మళ్లీ నిర్మాణం చేశారని, దీంతో పుణే నగరం మా సాహెబ్‌ జీజావు, ఛత్రపతి శివాజీ మహరాజు శౌర్యం, పరాక్రమానికి ప్రతీక అంటూ అభివర్ణించారు. ఇలాంటి నేపథ్యంలో పుణే పేరును జీజావు పూర్‌గా మార్చాలని సంభాజీ బ్రిగేడ్‌ పదాధికారి సంతోష్‌ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

విభేదాలు సృష్టించేందుకే: అజిత్‌పవార్‌ 
ఔరంగాబాద్‌ పేరును సంబాజీనగర్‌గా మార్చాలన్న అంశంపై కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. నాసిక్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా మహావికాస్‌ ఆఘాడీలో విబేధాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై మూడు పార్టీల అధినేతలు శరద్‌ పవార్, ఉద్దవ్‌ ఠాక్రే, సోనియా గాంధీలు చర్చలు జరిపి తుది నిర్ణయం ప్రకటిస్తారని స్పష్టంచేశారు. ‘‘మహారాష్ట్రలో 3 పార్టీలు కలిసి మహావికాస్‌ ఆఘాడీగా ఏర్పాటై ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర అభివృద్ది కోసం ఏర్పాటైన మహావికాస్‌ఆఘాడీ ప్రభుత్వం కామన్‌ మినిమం ప్రొగ్రామ్‌ ద్వారా అభివృద్ధి పనులు చేస్తోంది. అయితే కొన్ని సమయాల్లో ఇలాంటి అంశాలపై వివాదాలు తలెత్తినప్పుడు తమ అధినేత కలిసి సమస్యలకు పరిష్కారం కనుగొంటారు’’ అని అజిత్‌ తెలిపారు.   

పేరు మారుస్తున్నారా? లేదా? : మండలిలో ప్రతిపక్ష నాయకుడు దారేకర్‌  
ముంబై: ఔరంగాబాద్‌ పేరు మారుస్తున్నారా? లేదా? అనేది ప్రజలకు స్పష్టతనివ్వాలని మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్‌ దారేకర్‌ డిమాండ్‌చేశారు. గత కొద్దిరోజులుగా ఔరంగాబాద్‌ పేరు మారుస్తామని శివసేన, మార్చేది ఇష్టంలేదని కాంగ్రెస్‌ పోట్లాడుకుంటున్నాయని మండిపడ్డారు. అసలు శివసేన స్టాండ్‌ ఏంటో స్పష్టంగా చెప్పాలని దారేకర్‌ డిమాండ్‌చేశారు. 1995 జూన్‌లో అప్పటి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఔరంగాబాద్‌ పేరును సంభాజీనగర్‌గా మార్చే విషయంలో ప్రతిపాదన జరిగిందని, అయినా ఇప్పటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. దీనిపై కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కోర్టులో సవాల్‌ చేశారని గుర్తుచేశారు. అయితే  కేవలం పేరు మార్చి నంత మాత్రానా ఓ నగరం అభివృద్ధి జరగదని ఆయన స్పష్టంచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement