YSRCP MP Vijaya Sai Reddy Special Story About Karnataka Assembly Elections - Sakshi
Sakshi News home page

సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి!

Published Fri, May 5 2023 4:04 PM | Last Updated on Fri, May 5 2023 4:54 PM

MP Vijaya Sai Reddy on Karnataka Elections 2023 - Sakshi

రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ (మొత్తం 224 సీట్లు) 16వ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 10న జరుగుతున్న నేపథ్యంలో ఈ దక్షిణాది రాజ్యంపై నేడు అందరి దృష్టి పడింది. ఐటీ రంగంలో భారత సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరు ఇంజన్‌ మాదిరి పనిచేస్తూ.. టెక్నాలజీ కేంద్రంగా కర్ణాటకను ముందుకు తీసుకుపోతోంది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ తర్వాత నాలుగో అత్యంత ధనిక భారత రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది. 247.38 బిలియన్‌ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తితో (జీఎస్టీడీపీ) కర్ణాటక పరుగులు పెడుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే పొడవైన సముద్రతీరం, అరేబియా సముద్రం తీరం వెంబడి ఆధునిక రేవు పట్టణాలు, నగరాలు అభివృద్ధిచెందడం కూడా ఈ మూడో అతిపెద్ద దక్షిణాది రాష్ట్రం (ఏపీ విభజనతో ఈ స్థానం దక్కింది) ప్రగతికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, ఇంకా రాయలసీమ జిల్లాలవాసులకు తమిళనాడు రాజధాని చెన్నై మాదిరిగానే బెంగళూరు, ఇతర కర్ణాటక పట్టణాలు, నగరాలు వలస వచ్చి స్థిరపడడానికి అనువైన ప్రాంతాలుగా మారాయి.

బెంగళూరు, తుమకూరు తదితర ప్రాంతాలు అందించే వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలు లక్షలాది మంది తెలుగు ప్రజలను అక్కడకు రప్పిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వ్యక్తులు ఐదారుగురు వరకూ వివిధ పార్టీ తరఫున కర్ణాటక శాసనసభకు కిందటి రెండు మూడు ఎన్నికల్లో గెలవడం సాధారణ విషయంగా మారింది. దక్షిణాదిన లోక్‌ సభ నియోజకవర్గాల సంఖ్య రీత్యా చూస్తే తమిళనాడు తర్వాత (39) అత్యధిక స్థానాలు ఉన్నది ఈ రాష్ట్రంలోనే (28). తెలుగు, కన్నడ లిపుల మధ్య పోలికలు ఉండడమేగాక, గతంలో రెండు రాష్ట్రాల రాజకీయాలు కూడా ఒకే తీరున నడిచాయి. 

1978 నుంచి 2004 వరకూ ఒకే సమయంలో ఏపీ, కర్ణాటక ఎన్నికలు 

1978 జనవరిలో భారత జాతీయ కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయిన రెండు నెలలకే ఉమ్మడి ఏపీ, కర్ణాటకలో ఒకేసారి జరిగిన ఈ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో కొత్తగా హస్తం గుర్తుతో వచ్చిన కాంగ్రెస్‌ (ఐ) రెండు చోట్లా విజయం సాధించింది. అలాగే ఐదేళ్ల తర్వాత 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏపీ, కర్ణాటకలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి.

అయితే 2004 వరకూ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం విశేషం. కాని, 2004 ఎన్నికల తర్వాత ఏర్పడిన కర్ణాటక 12వ శాసనసభ రాజకీయ అస్థిరత వల్ల నాలుగేళ్లకే రద్దవడంతో ఈ రెండు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడాది కాలం వ్యత్యాసంతో జరగడం ఆనవాయితీగా మారింది. అలాగే కిందటిసారి తెలంగాణ అసెంబ్లీకి ఆరు నెలలు ముందుగానే 2018 డిసెంబర్‌ లో ఎన్నికలు జరిపించడంతో ఇప్పుడు మొదట వేసవిలో (మే నెలలో) కర్ణాటకలో, శీతాకాలంలో (డిసెంబర్‌) తెలంగాణలో, వచ్చే ఏడాది ఏప్రిల్‌–మేలో ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

గత 30 ఏళ్లలో సంభవించిన రాజకీయ పరిణామాల వల్ల ఇలా మూడు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఆరు నెలల తేడాతో వరుసగా మూడు వేర్వేరు సందర్భాల్లో జరిగే పరిస్థితి వచ్చింది. తమిళనాడులో మాదిరిగానే లక్షలాది మంది తెలుగువారు అన్ని రంగాల్లో, ప్రాంతాల్లో స్థిరపడిన రాష్ట్ర్రం కావడంతో కర్ణాటక రాజకీయాలపై తెలుగునాట ఎనలేని ఆసక్తి వ్యక్తమౌతోంది. మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాజకీయాల ప్రభావం విస్తరించిన కర్ణాటక ప్రజల తీర్పు ఎలా ఉంటుందా అని ఓట్లు లెక్కించే మే 13 కోసం తెలుగు ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. 2004 ఎన్నికల నుంచీ కర్ణాటకలో ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ రాకుండా హంగ్‌ అసెంబ్లీలే ఏర్పడుతూ వస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాతైనా ఈసారి రెండు ప్రధాన జాతీయపక్షాల్లో ఏదో ఒక పార్టీకి కనీస మెజారిటీకి అవసరమైన సీట్లు వస్తాయా? రావా? అనేదే నేడు బిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.


విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement