ఇదే కదా చంద్రబాబు మార్క్ క్షుద్ర రాజకీయం | The Yellow Gang Cannot Bear AP Development | Sakshi
Sakshi News home page

ఇదే కదా చంద్రబాబు మార్క్ క్షుద్ర రాజకీయం

Published Thu, Aug 3 2023 2:55 PM | Last Updated on Thu, Aug 3 2023 3:37 PM

The Yellow Gang Cannot Bear AP Development - Sakshi

కుక్క తోకని ఎంత సాపు చేద్దామన్నా కుదరదు. అది తిరిగి వంకర్లు పోతుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ తీరుకూడా అంతే. కుక్క తోకలా వంకరే. అధికారానికి దూరంగా ఉండడం టీడీపీ నేతలకు చాలా కష్టంగా ఉంది. తమ ప్రభుత్వం లేదు కాబట్టి ఉన్న ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లి అప్రతిష్ఠపాలు చేయడానికి విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు.  

పదే పదే తలబొప్పి కడుతోన్నా చేసిన తప్పులనే మళ్లీ చేసుకుపోతున్నారు పచ్చ గ్యాంగ్. తాజాగా ఏపీలో ఉపాధి హామీ పధకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించి కేంద్ర మంత్రి చేత చీవాట్లు తిని వచ్చారు టీడీపీ ఎంపీలు.

పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది.అచ్చం అలాగే టీడీపీ నేతలు కూడా  అన్ని ప్రభుత్వాలూ తమలాగే  అవినీతికి పాల్పడతారని అనుకుంటూ ఉంటారు. తాము అనకున్నదే ఆలస్యం  ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో 2019లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న టీడీపీ నేతలు ఆ తర్వాత నాలుగున్నేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ చావు దెబ్బలు తింటూనే  ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమకి భంగపాటు తప్పదన్న  ఆలోచన రాగనే  ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు.

తాజాగా టీడీపీ ఎంపీలు  కొందరు టీడీపీ సానుభూతి పరులైన సర్పంచులను తీసుకుని  ఢిల్లీలో కేంద్ర మంత్రి ని కలిసి కపిల్‌ మొరేశ్వర్ పాటిల్‌ ను కలిసి మా రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతోంది..అక్రమాలు జరిగిపోతున్నాయి అంటూ  మొర పెట్టుకున్నారు. ఏం జరుగుతోందని మంత్రి ఆరా తీస్తే  ఉపాధి హామీ పథకం అమలులో  పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.

టీడీపీ ఎంపీలు  చెప్పేదంతా సావధానంగా విన్న మంత్రి కపిల్  వారికేసి ఓ సారి చికాగ్గా చూశారు. ఉపాధి హామీ పథకంలో  చెల్లింపులన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి కదా అని  ప్రశ్నించిన మంత్రి  కూలీల హాజరు, వారు చేసే పనులు అన్నీ కూడా  జియో ట్యాగింగ్ ఉండడమే కాకుండా ప్రతీ దానికీ సాక్ష్యాధారంగా ఫోటోలు కూడా ఉన్నాయి కదా అని  వ్యాఖ్యానించారు. అవినీతికి కానీ అక్రమాలకు కానీ అసలు ఆస్కారమే లేదని తేల్చి పారేశారు. ఏదో ఒక వర్గం ఫిర్యాదు చేసింది కదా అని వాస్తవాలు పక్కన పెట్టి  తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని తెగేసి చెప్పారు. 

దాంతో పచ్చ నేతలు తెల్లమొహాలేసుకున్నారు. తమ కుట్ర ఆదిలోనే భగ్నం కావడాన్ని పరాభవంగానే పరిగణించినప్పటికీ నోట మాట లేక ఉండిపోయారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది  అని  టీడీపీ నేతలు మొహాలు మాడ్చేసుకున్నారు.

ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలన్న టీడీపీ నేతల  యత్నాలు ఏళ్ల  తరబడి సాగుతూనే ఉన్నాయి. గత నెల 25న పార్లమెంటులో ఓ చిత్రమైన ఘటన. బి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావు  ఏపీ లో ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఓ ప్రశ్న వేశారు. తెలంగాణా ఎంపీకి ఏపీ అప్పులతో ఏం పని అనుకుంటున్నారా? అదే కదా చంద్రబాబు నాయుడి మార్క్ క్షుద్ర రాజకీయం అంటే. నామా నాగేశ్వరరావు ఇపుడంటే గత్యంతరం లేక బి.ఆర్.ఎస్. లో ఉన్నారు కానీ అంతకు ముందు ఆయన టీడీపీ ఎంపీనే.

చంద్రబాబు నాయుడికి బాగా కావల్సిన సామాజిక వర్గీయుడు కూడా. అందుకే  తనకు సంబంధం లేని వ్యవహారంలో తల దూర్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఏపీ అప్పులు  పరిమితులకు లోబడే ఉన్నాయని సమాధానం చెప్పే సరికి నామా చాలా  నిరుత్సాహ పడ్డారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ప్రకటన ఉంటుందని ఆశించిన నామాకు భంగపాటు తప్పలేదు. 

నామాతో పని కాకపోయే సరికి కొద్ది రోజుల గ్యాప్ తర్వాత  మాజీ టీడీపీ నాయకుడు.. ప్రస్తుత  టీడీపీ అనధికార నాయకుడు అయిన రఘురామ కృష్ణంరాజు కూడా ఏపీ అప్పులపై ప్రశ్న వేశారు.  దానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామనే  సమాధానం చెబుతూ  ఏపీలో చంద్రబాబు నాయుడి హయాంలో చేసిన అప్పుల కన్నా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేసిన అప్పులు చాలా తక్కువని లెక్కలతో సహా వివరించారు. 

అనుమతులు, నిబంధనలకు లోబడే అప్పులు ఉన్నాయని కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో రఘురామ కూడా ఆముదం తాగినట్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. టీడీపీ నేతలు  వారి అనుకూల మీడియాలు ఏపీ ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేయడానికి విష యత్నాలు చేస్తూ ఉంటే..కేంద్ర మంత్రులతో పాటు నీతి అయోగ్ అధికారులు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు పథకాలు..అమలు చేస్తోన్న కార్యక్రమాలు అద్భుతమంటూ  మెచ్చుకుంటున్నారు. దీన్ని అస్సలు భరించలేకపోతున్నారు ఎల్లో గ్యాంగ్.
-సీఎన్‌ఎస్‌ యాజులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement