
చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఒక వ్యక్తిని చంపాలనుకోవడం తప్పు ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి.
వైఎస్సార్, సాక్షి: ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత వ్యాఖ్యలపై పులివెందుల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారామె.
సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతోషగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. పులివెందులలో అభివృద్ధి లేదనే వారికి కళ్లు లేవు అనుకోవాలి. పులివెందులలో ఎంతో అభివృద్ధి జరిగింది.
చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రజాజీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఒక వ్యక్తిని చంపాలనుకోవడం తప్పు ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి. ఇది ఆయన విక్షణకే వదిలేస్తున్నాం. ప్రజలను మెప్పించుకోవాలి కానీ, అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం అని భారతి అన్నారు.

ఇదిలా ఉంటే.. వైఎస్ భారతి ప్రచారానికి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడపగడపకు వెళ్లి అయిదేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు.