తప్పు చేస్తున్నావ్‌ చంద్రబాబూ.. వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌ | Ys Jagan Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తున్నావ్‌ చంద్రబాబూ.. వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌

Published Wed, Sep 11 2024 12:21 PM | Last Updated on Wed, Sep 11 2024 6:44 PM

Ys Jagan Comments On Chandrababu Govt

సాక్షి, గుంటూరు: ఇంత  దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం​ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్‌ జగన్‌ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులతో ఒక  దళిత నేతను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు.

బాబు తప్పిదాలను డైవర్ట్‌ చేసేందుకే అక్రమ కేసులు
‘‘చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలం అయ్యింది. బాబు తప్పిదాలను డైవర్ట్‌ చేసేందుకే అక్రమ కేసులు. నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారు.  సిట్టింగ్‌ సీఎంను టీడీపీ నేత దారుణంగా దూషించాడు. సీఎంగా నన్ను దూషించినా బాబులా కక్ష సాధింపునకు దిగలేదు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టాం’’ అని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్‌
‘‘నాడు జరిగిన ఘటనలో నందిగం సురేష్‌ ఉన్నాడా?. సీసీ ఫుటేజ్‌లో ఎక్కడైనా నందిగం సురేష్‌ కనబడ్డాడా?. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్‌. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక  సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది.. ఇదే జైల్లో ఉంటారు. రెడ్‌బుక్‌ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే బాబు దృష్టి పెట్టాడు. ప్రజా సమస్యలపై దృష్టి లేదు.’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'!

చంద్రబాబు తప్పుడు పనికి 60 మంది బలి
‘‘తుపాను వస్తుందని ముందే చెప్పినా బాబు పట్టించుకోలేదు. తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచారు. బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారు. చంద్రబాబు తప్పుడు పనికి 60 మందికిపైగా చనిపోయారు. 60 మందిని పొట్టను పెట్టుకున్న బాబుపై కేసు ఎందుకు పెట్టరు?. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారు. బోట్లకు ఎవరి హయాంలో పర్మిషన్‌ వచ్చింది?. చంద్రబాబు గెలవగానే ఇదే బోట్లపై విజయోత్సవాలు చేశారు. బాబు, లోకేష్‌తో కలిసి బోటు ఓనర్‌ ఉషాద్రి ఫొటోలు దిగాడు. టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతి ఇచ్చారు. ఈ బోట్లన్నీ టీడీపీ నేతలకు చెందినవే. వాస్తవాలు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. ప్రజలకు తోడుగా నిలవకుండా నేరాన్ని మాపై నెడుతున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

 

రాష్ట్రంలో పాలన ఉందా?
‘‘సూపర్‌ సిక్స్‌ హామీలు.. ఇప్పడు మోసమని తేలాయి. రాష్ట్రంలో పాలన ఉందా?. సచివాలయ వ్యవస్థను నీర్వీర్యం చేశారు. ఇంటింటికి సేవలను  నిలిపేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం లేదు. అమ్మఒడి పథకాన్ని గాలికొదిలేశారు. బడుల్లో తిండి తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మందులు, నర్సుల  కొరత ఉంది. మెడికల్‌ కాలేజీలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement