భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా? | Sakshi
Sakshi News home page

భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా?

Published Tue, May 7 2024 5:51 AM

YS Jagan mohan Reddy comments on Chandrababu

చంద్రబాబు, ఎల్లో మీడియాకు బందరు సభలో సీఎం జగన్‌ సూటి ప్రశ్న

6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సర్వేలు పూర్తి చేశాం

రైతులు, భూ యజమానులకు సంపూర్ణ హక్కులే ఈ యాక్ట్‌ లక్ష్యం

వివాదాలు లేని టైటిళ్లతో మీ భూములకు ప్రభుత్వం గ్యారెంటీ.. ఇన్సూరెన్స్‌ కూడా

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఇళ్లకు ఫోన్లు చేసి మరీ దుష్ప్రచారం

అసెంబ్లీలో నాడు పయ్యావుల పొగడ్తలు.. బిల్లుకు టీడీపీ మద్దతు

రైతన్నలకు మంచి జరుగుతుందంటూ ఈటీవీలో సైతం కథనం

ఇప్పుడు యూట్యూబ్‌ నుంచి తొలగించి దుష్ప్రచారం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి అయిన 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాక్కున్నారని చెప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. సర్వే చేసి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. 

ఎలాంటి వివాదాలు లేకుండా ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించటమే ఈ యాక్ట్‌ ఉద్దేశమని స్పష్టం చేశారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. సంబంధిత భూమిపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ సంస్కరణ తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం ఆలోచన అని వెల్లడించారు.  సోమవారం మచిలీ­పట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సీఎం జగన్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై పూర్తి స్పష్టతనిచ్చారు. 

ఈ యాక్ట్‌ చాలా గొప్పదని స్వయంగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో చెప్పాడని, బిల్లుకు టీడీపీ సైతం సభలో మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్ని­కలు రావడంతో చంద్రబాబు నాలుక మడతేసి మంచి సంస్కరణను ఆపేందుకు కుట్రలు చేస్తు­న్నారని దుయ్యబట్టారు. సజావుగా ఇంటికొచ్చే ఫించన్లను సైతం చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్ల ఫించనర్లు నానా అగచాట్లు పడుతున్నారన్నారు. సీఎం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఏమన్నారంటే..

లాక్కున్నారని ఒక్కరైనా చెప్పారా?
భూమికి సంబంధించిన మ్యాప్‌తో కూడిన భూ హక్కు పత్రాలను కూడా రైతన్నలకు పదిలంగా అందించే కార్యక్రమం చేస్తున్నాడు మీ జగన్‌. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే సమర్థించాల్సింది పోయి ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో గమనించాలని ప్రజలను కోరుతున్నా. రాష్ట్రవ్యా­ప్తంగా సర్వే పూర్తి అయిన 6 వేల రెవెన్యూ గ్రా­మాల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాక్కున్నారని చెప్పారా? అని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5ను అడుగుతున్నా. ఒక మంచి సంస్కరణను ఆపడానికి వీరంతా ప్రయత్నం చేస్తున్నారు. 

నాడు టీడీపీ, ఈటీవీ ప్రశంసలు..
నిజంగా వీళ్ల మాటల్లో ఎంత డొల్లతనం ఉందంటే.. ఇదే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఎంతో మంచిదంటూ శాసనసభలో చర్చ సందర్భంగా టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్‌ ఎంత పొగిడాడో అసెంబ్లీ రికార్డులు చూసుకోండి. చివరకు దుష్ప్రచారం చేస్తున్న ఇదే ఈటీవీలో నాలుగు నెలల క్రితం ఇది మంచి యాక్ట్, రైతన్నలకు మంచి జరుగుతుందని ప్రచారం చేశారు. ఇవాళ ఎన్నికలు రాగానే యూట్యూబ్‌ నుంచి వాళ్లు ప్రసారం చేసిన ఆ కథనాన్ని తొలగించి  అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో మీరే చూడండి.

వివాదాలు లేకుండా సంపూర్ణ హక్కులే లక్ష్యం..
ఈమధ్య కాలంలో బాబు బృందం ఇంకో దుష్ప్రచారం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద. ప్రతి ఒక్కరికీ ఫోన్లు చేసి అబద్ధాలు చెబుతున్నారు. అసలు ల్యాండ్‌ టైటిలింగ్‌ అనేది ఏమిటో మీలో ఎవడికైనా తెలుసా? అని ఈ దుష్ప్రచారం చేసేవాళ్లను అడుగుతున్నా. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అంటే.. వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేలా చట్టం చేయడమని ఈ మూర్ఖులకు తెలియజేస్తున్నా.

ఈ రోజుల్లో ఎక్కడ భూమి కొనాలన్నా కూడా ఏదో ఒక వివాదాలు కనిపిస్తుంటాయి. భూములు అమ్మాలనుకునేవారికి, కొనాలనుకునేవారికి తెలియని భయం ఉంటుంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ, తక్కువగా ఉండటం, సబ్‌ డివిజన్‌ జరక్కపోవడం, రికార్డులన్నీ అప్‌డేట్‌ కాకపోవడం, మ్యుటేషన్‌ జరగకపోవడం.. ఇలాంటి వాటి కారణంగా భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతున్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ వల్ల ఇటువంటి వివాదాలకు తావు వుండదు.

ప్రతి ఒక్కరికీ వాళ్ల భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి, ఆ హక్కులకు గ్యారెంటీ ఇస్తూ గవర్నమెంట్‌ వాళ్లకు తోడుగా ఉండేలా చేయడమే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు అర్థం. రైతులు, భూ యజమానులు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆ భూముల మీద యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, ఎలాంటి వివాదం లేదని గ్యారెంటీ ఇచ్చే ఒక సంస్కరణే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌. ఇదొక్కటే కాదు.. రేపు వివాదం తలెత్తితే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా ఆ భూ యజమానులకు కాంపన్‌సేషన్‌ ఇచ్చే విధంగా కూడా చేస్తున్నాం. ఇది కూడా చట్టంలో చేర్చాం.

రైతులపై పైసా భారం పడకుండా..
ఇలా ఒక సంస్కరణ తెచ్చి భూ యజమానులు, రైతులకు రక్షణ కల్పించే కార్యక్రమం జరగాలంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 వేల రెవెన్యూ గ్రామాల్లో జరుగుతున్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూయజమానికి సంబంధించిన రికార్డులు అప్‌డేట్‌ కావాలి. మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈ పని చేస్తున్నాడు. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్‌ చొప్పున 15,000 మంది సర్వేయర్లను నియమించాం. రోవర్లను కొనుగోలు చేశాం. కోర్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేశాం. జీపీఎస్‌తో సరిహద్దు రాళ్లు సైతం పాతిస్తున్నాం. ఇందుకోసం రూ. 2వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. మీ బిడ్డ ఈ ఖర్చును చిరునవ్వుతో భరాయిస్తున్నాడు.

కేవలం నా రైతన్నలకు మేలు జరగాలి.. భూ యజమానులకు మంచి జరగాలి.. వారి చేతుల్లో ఉన్న టైటిల్స్‌ ఎవరికైనా స్వేచ్ఛగా అమ్ముకునేందుకు సర్వహక్కులూ ఉండాలి.. ఎలాంటి వివాదాలు రాకూడదు.. ఏ కోర్టు చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదని మీ బిడ్డ ఈ కార్యక్రమం చేస్తున్నాడు. 17 వేల రెవెన్యూ గ్రామాలకుగానూ 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సర్వేలు పూర్తి అయ్యాయి. ఇంకా ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల్లో మిగతా గ్రామాల్లో కూడా సర్వేలన్నీ పూర్తిచేసి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తాం. అవసరమైన చోట సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు. ఇవన్నీ కూడా భూ యజమానులకు, రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మొత్తం మీ బిడ్డే చేయిస్తున్నాడు.

Advertisement
 
Advertisement