టీడీపీ పాలనలో రాజకీయ దాడులు.. హత్యలు
ఈ తరహా దాడుల్ని ఏనాడూ మేం ప్రొత్సహించలేదు
వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి
భారత రాజ్యాంగం కాదు.. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులకు భద్రత కరువు
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ దృష్టికి తీసుకెళ్లాలని జాతీయ మీడియాకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
వైఎస్సార్సీపీని అణగదొక్కడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోంది. మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటివేమీ చేయలేదు. హత్యలు చేయలేదు. దాడులు చేయలేదు. ఆస్తుల విధ్వంసం చేయలేదు. ఎవరి ఇళ్లలోకి చొరబడి, వారిని వేధించలేదు. వారిపై దాడి చేయలేదు. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదు.
చంద్రబాబు కుమారుడైనా నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టాడు. ఎవరెవరి మీద దాడుల చేయాలి. ఎవరిని ఎలా వేధించాలి. అన్న అన్ని వివరాలు రాసినట్టు.. అందులో లోకేష్ స్వయంగా ప్రకటించారు. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశాము. వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నాం. దయచేసి, ఒక్కసారి ఈ ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణస్థితిని అర్ధం చేసుకొండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. మా పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగింది. ఆయన వాహనాలు ధ్వంసం చేశారు.
ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. అంత కంటే దారుణం ఏమిటంటే.. మా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి కాపాడకపోగా.. వారిపై కేసులు నమోదు చేయకపోగా.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఇంకా ఎక్కడైనా ఉంటుందా?.
దయచేసి, మీరంతా ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి. ఇక్కడ మా నిరసన కార్యక్రమానికి మీరు అండగా నిలవమని కోరుతున్నాను. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. అందుకే మరోసారి నేషనల్ మీడియాను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, మీ ఇంట్లోకి చొరబడి, మీపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు?. కాబట్టి, దయచేసి ఇక్కడి గ్యాలరీలో ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితి గురించి తెలుసుకొండి. ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అని జగన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment