సాక్షి, హైదరాబాద్: కేసీఆర్.. మీ ఛాతిలో ఉన్నది గుండెనా.. బండనా అంటూ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్టాఫ్ట్ నర్సులుగా సెలెక్ట్ అయ్యి.. పోస్టింగులు పొందలేకపోయిన అభ్యర్థులతో వైఎస్. షర్మిల, తన ప్రధాన అనుచరురాలు ఇందిరాశోభన్ తో కలిసి వీడియా కాన్ఫరెన్స్ పాల్గొన్నారు. 2017లో 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి.. 2018లో పరీక్ష నిర్వహించగా.. 2021 ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించారని బాధిత అభ్యర్థులు తెలిపారు. కటాఫ్ మార్కుల ఆధారంగా 3,170 మంది అర్హత సాధించారని.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3076 మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి, అందరినీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కమిషన్ తెలిపిందన్నారు. అనంతరం.. 2,418 మందిని మాత్రమే ఎంపిక చేసిన టీఎస్పీఎస్సీ, మిగతా 658 మందిని ఎలాంటి కారణాలు లేకుండా పక్కన పెట్టిందని షర్మిల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
బాధిత అభ్యర్థుల ఆవేదన విన్న అనంతరం.. ఆమె మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న వేళ సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులను పక్కన బెట్టి.. కాంట్రాక్టు పద్ధతిన వైద్య సిబ్బందిని నియమించడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు హయాంలో అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తున్న సమయంలో.. ముఖ్యమంత్రి పదవిని కూడా కాంట్రాక్టు పెట్టుకుంటే సరిపోదా అని కేసీఆర్ అన్న మాటలను గుర్తుతెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగాలకు కిటికీలు తెరిస్తే.. మీరు తలుపులు తెరవడాన్ని ఏమనాలని వైఎస్.షర్మిల ప్రశ్నించారు.
పీఆర్సీ నివేదిక ప్రకారమే వైద్య, ఆరోగ్యశాఖలో 23,724 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. కోవిడ్ సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా ఉన్న నేపథ్యంలో ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని వైఎస్.షర్మిల ప్రశ్నించారు. గత ఏడాది బడ్జెట్ లో ఆరోగ్యశాఖకు 3.3శాతం నిధులు కేటాయించిన ప్రభుత్వం.. కరోనా సమయంలో ఈ ఏడాది అధిక నిధులు కేటాయించడం పోయి.. 2.7శాతం నిధులు మాత్రమే ఇచ్చి.. ప్రజారోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థంకావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల నూతన ఆసుపత్రులను నిర్మించాలని.. మరో 50 వేల వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. ఇందులో స్టాఫ్ ను నియమించే ముందు.. మీ నిర్లక్ష్యానికి నష్టపోతున్న 658 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులందరికీ తక్షణమే పోస్టింగులు ఇవ్వాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. నర్సింగ్ సంబంధించిన పోస్టులన్నింటినీ కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా పర్మినెంట్ గా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. తెలంగాణలో నిరుద్యోగ యువత మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడక ముందే.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాల్సిన అవసరముందన్నారు.
చదవండి: బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు
సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment