
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాన్నే సరిగా పరిపాలించట్లేదు.. దేశాన్ని ఏలతారట. అసలు కేసీఆర్‌కు ఆ అర్హత ఉందా’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు.. అసలు బతుకే లేని తెలంగాణగా మార్చారు’ అని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు.
మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలుండవని కేసీఆర్ మాటిచ్చారు. అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ నిరుద్యోగులకు బతుకే లేకుండా చేశారు’అని విమర్శించారు. ఒకప్పుడు కేసీఆర్ స్కూటర్ మీద తిరిగేవారని, ఇప్పుడు ప్రగతిభవన్‌లో ఆడంబరాలు అనుభవిస్తున్నారని.. మరి రైతులు, నిరుద్యోగుల బతుకులు ఇలాగే ఉండిపోవాలా అని నిలదీశారు.
బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు తేడా లేదు
‘బీజేపీ మతతత్వ పార్టీ. వారి అవసరాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకుంటోంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు. ప్రధాని గానీ, సీఎం గానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడరు. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు’ అని షర్మిల ఆరోపించారు. ‘తెలంగాణ, ఆంధ్ర కలిసిపోతాయని ఎలా అంటారు. అది ఎప్పటికీ జరగదు’అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎంత త్వర గా వస్తే ప్రజలకు అంత మంచిందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు గట్టు రాంచందర్‌రావు, లీగల్ సెల్ కోఆర్డినేటర్ వరప్రసాద్ పాల్గొన్నారు.