సాక్షి, తాడేపల్లి: కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షల దిశగా అడుగులు వేసిన పార్టీ ఇది. ప్రజల ఆశలకు ఒక రూపం ఇచ్చిన ఘనత పార్టీ సభ్యులది. ఈ మూడేళ్ళలోనే.. మూడు దశబ్దాల అభ్యుదయం కన్పిస్తోంది. అధికారం కోసం కొట్లాడే రాజకీయం కాకుండా సేవ చేయడంలో పోటీ చూపిస్తోంది కాబట్టే ఇంత ప్రజాదరణ దక్కుతోంది అన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు.
‘‘బడ్జెట్ సందర్భంగా నిన్న బుగ్గన ‘నాలుగు మూల స్తంభాలు’ అన్నారు. మహానుభావుల కల ఏడు దశబ్దాల అయినా కాలేదు. కానీ మన పాలనలో రెండేళ్లలోనే గట్టి పునాది వేశాం. అది మన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ప్రతి కుటుంబం కుంగిపోతున్న తరుణంలో.. విద్యా, వైద్యం అందిస్తూ సమగ్ర మార్పునకు కృషి చేశారు. చదువు కొనాల్సిన అవసరం లేకుండా.. చదువుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. రాజకీయంగా అన్ని వర్గాలకు సాధికారత తీసుకొచ్చాం. మహిళలకు నిజమైన సాధికారత దిశగా అడుగులు వేశాం’’ అని పేర్కొన్నారు సజ్జల.
టీడీపీ ఏడ్పుగొట్టు రాజకీయాలు..
‘మౌలిక వసతుల విషయంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. గర్భంలో ఉన్న శిశువు దగ్గరి నుంచే చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోంది. ప్రభుత్వ స్కూల్లో సీటు కోసం సిఫార్సులకు వస్తున్నారంటే వాస్తవ అభివృద్ది కనిపిస్తోంది. కింది స్థాయిలో అన్ని వర్గాలు వారి కాళ్ళమీద వారు నిలబడే దిశగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. కానీ, చంద్రన్న కానుక లాంటి స్కాంలు చేసిన ఘనత ఉన్నవాళ్లు.. ఇప్పుడు ఏడ్పుగొట్టు రాజకీయాలు చేస్తున్నారు. కుప్పంలో కూడా ఓడిపోయి.. నిన్న అండమాన్ గెలిచామని పండుగ చేసుకునే దుస్థితికి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి మూడింతలు చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టే స్థానిక సంస్థలలో విజయభేరీ మోగించాం.
అందుకే అప్రమత్తంగా ఉండాలి...
మనకు ప్రత్యర్థులు ఎవరూ లేరు...ప్రజల్ని మోసం, దగా చేసే వారే ప్రజలకు ప్రత్యర్థులు. అటువంటి వారి కుయుక్తులకు చెక్ పెట్టాలి. మిగిలిన పార్టీలకు మనకు పొంతన లేదు. శాశ్వతంగా ప్రజల మన్ననలు పొందేలా నిలబడే పార్టీ మనది. మానవాభివృద్ధితో కుటుంబాలన్నీ పైకి వచ్చేలా మనం అవకాశాలు సృష్టిస్తున్నాం. మాయలు, చేతబడులు చేసే వారిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఒక అరిష్టంలా మారిన టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలి. నిన్న కూడా 160 సీట్లు అంటున్నారు.. ఇప్పటికీ అబద్దాలు చెప్తూనే ఉన్నారు.
క్షేత్రస్థాయి నుంచే సిద్ధంగా ఉండండి
ఈ సారి ప్లీనరీ జరుగుతుంది...సభ్యత్వ నమోదు ఉంటుంది. నిజంగా చంద్రబాబు అయితే కోవిడ్ అవకాశంగా పథకాలన్నింటికీ గుండుసున్నా చుట్టేవాడు. ఎంత ఆదాయం తగ్గినా మాట కోసం మన నాయకుడు పడుతున్న కష్టాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు పెడుతున్న ప్రతి పైసా లబ్దిదారుడికి చేరాలి అనేది మన లక్ష్యం. జగనన్న పథకాల అమలుపై ప్రతిఒక్క కార్యకర్త అందరికీ అందుతున్నాయా లేదా అనేది చూడాలి. అది మీకు పార్టీ మీకు ఇచ్చిన బాధ్యత...అది మీ హక్కు..
ప్రత్యర్థులు చేస్తున్న మాయా మంత్రాలను క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలని కోరుకుంటున్నాను. ప్రజల జీవితంలో మమేకం అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment