ధర్మవరం(శ్రీసత్యసాయి జిల్లా): వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఏడో రోజు బస్సుయాత్రలో భాగంగా జిల్లాలోని ధర్మవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ బస్సుయాత్ర సాగగా తహశీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగ్గా, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన ప్రజలనుద్దేశించి పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించారు.
పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ‘ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారు. సీఎం జగన్‌కు వెనుకబడిన వర్గాలు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు’ అని స్పష్టం చేశారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకే అత్యధిక లబ్ది చేకూరింది. బస్సుయాత్రను ఆపేశక్తి టీడీపీ, జనసేనలకు లేదు’ అని తెలిపారు.
మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. బీసీ మహిళ అయిన నాకు టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వలేదు. కులగణన కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు చారిత్రాత్మకం’ అని పేర్కొన్నారు.
మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కి మరోసారి పట్టం కట్టాలి. జగన్ సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ పాలనలో పేదలు మూడు పూటలా ఆహారం తింటున్నారు’ అని అన్నారు.
మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ సాధికార బస్సు యాత్ర లో నల్లజెండాలు ప్రదర్శించాలని లోకేష్ అంటున్నారు. గత ఐదు రోజులుగా చూస్తున్నా .. ఎవరైనా వస్తారని. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్‌దే. వెనుకబడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఏపీలో సుపరిపాలన జరగకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కుట్రలు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపైనే ఉంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని 175 స్థానాల్లో గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘ సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. వెనుకబడిన వర్గాల ఉన్నత విద్య చదవాలనే మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారు’ అని నొక్కి చెప్పారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరిగింది. సమాజంలో 80 శాతం ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకే ఇచ్చారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే. గత నాలుగున్నరేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలోనే రూ. 2500 కోట్ల లబ్ధి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌కు ప్రజలందరూ అండగా నిలవాలి’ అని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment