రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులపై టీడీపీ నేతలు పెడుతున్న అరాచక సోషల్ మీడియా పోస్టులపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. వైఎస్ జగన్ సహా అనేకమంది నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై ఆధారాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఫిర్యాదు చేశారు
నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై, టీడీపీ సోషల్ మీడియా విష ప్రచారంపై జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ కోరగా నిరాకరించారు. దీంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మీడియాతో మాట్లాడారు.
నీచంగా పోస్టులు.. పోలీసులకు కనపడవా..?: కాకాణి
సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం. కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా పోయింది, నాపైనే పోలీసులు అక్రమంగా నాలుగు కేసులు నమోదు చేశారు, వైస్సార్సీపీ నేతలు నోరు తెరిచినా కూడా కేసులు పెడుతున్నారు. పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. చివరికి కుటుంబ సభ్యులను కూడా దుషిస్తున్నారు.
అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. మా అధినేత జగన్‌ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. జగన్ కుటుంబ సభ్యులు మీద కూడా నీచాతి నీచంగా పోస్టులు పెడుతుంటే.. అవి పోలీసులకు కనపడవా..? పోలీసులు ఖాకి చొక్కాలు వదిలేసి.. పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు. శాంతిభద్రతలు అదుపుతప్పితే పోలీసులదే బాధ్యత. మాజీ సీఎం జగన్‌పై పోస్టింగ్ లు పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి. ఇబ్బంది పెడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదు.. ఎక్కడ దాక్కున్నా లాక్కోస్తాం..
మరో తిరుగుబాటు రాబోతుంది: ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. అందరికీ ఓకే న్యాయం ఉండాలి.. వైసీపీ యాక్టివిస్ట్‌లను అక్రమంగా అరెస్ట్ చెయ్యడం దారుణం. చంద్రబాబును చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్టంలో మరో తిరుగుబాటు రాబోతుంది. ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. వన్ సైడ్ చేసే అధికారులకు మా ప్రభుత్వం వస్తే ఇబ్బందులు తప్పవు.
ప్రజలు గమనిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కిలివేటి
హామీలను అమలు చెయ్యాలని ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు.. ఫోటోలు మార్ఫింగ్ చేసి.. మాజీ సీఎం జగన్ పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను అన్ని స్టేషన్లకి తిప్పి.. కొడుతున్నారు.. వీటిని ప్రజలు గమనిస్తున్నారు..
అక్రమ కేసులు, అరెస్టులు దుర్మార్గ చర్య: ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు: సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ జగన్, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విష ప్రచారంపై జిల్లా ఎస్పీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు మేయర్ బి వై రామయ్య.. పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీదేవి, సతీష్ మీడియాతో మాట్లాడారు.
ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులు దుర్మార్గమైన చర్య. టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి నేతలు దౌర్జన్యం పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్నారు.
ప్రశ్నిస్తే ఎదురు కేసులు: శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి
అన్నమయ్య జిల్లా: రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో టీడీపీ సోషల్ మీడియాపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. డిఎస్పీ కృష్ణమోహన్‌కు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి వినతిపత్రం అందించారు. ఈ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని.. ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ద్వంద వైఖరీ విడాలి. మహిళలను ఏ పార్టీకి చెందిన వారైనా సరే కించపరిస్తే చర్యలు తీసుకోవాలి.
సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రతాపం చూపడం ఏంటి?: కాటసాని
నంద్యాల జిల్లా: సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై పెడుతున్న అక్రమ కేసులను ఖండిస్తూ నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి వినతి పత్రం అందజేశారు.
కాటసాని మాట్లాడుతూ, సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టులు చేసి కేసులు బనాయించి వేధించడం ప్రభుత్వానికి తగదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రతాపం చూపడం ఏంటి?. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు డబ్బులు దండుకునే విషయంలో సిక్స్‌లు కొడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడం సరైన పద్ధతి కాదు.
Comments
Please login to add a commentAdd a comment