దళితుడినైన నన్ను వేధిస్తున్నావు.. నీ పతనం ప్రారంభమైంది
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేస్తే అరాచకం చేస్తావా?
టీడీపీలో ఉండగా నీ చేతులతోనే నా ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశావు
అప్పుడు అక్రమాలు కనిపించలేదా? ఇప్పుడు కూలగొట్టించావు
నీ అరాచకాలకు నిరసనగా గుండు గీయించుకుంటున్నా
విజయవాడ టీడీపీ ఎమ్మెల్యేపై వైఎస్సార్‌సీపీ దళిత నేత నందెపు జగదీష్ ఫైర్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పాయకాపురం (విజయవాడ రూరల్) : ‘ఉమా.. నీకు అధికార మదం తలకెక్కింది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి అనుకూలంగా పనిచేసిన నన్ను వేధిస్తున్నావు. అక్రమ నిర్మాణం పేరుతో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి నా ఇంటిని కూలగొట్టించావు. నేను టీడీపీలో ఉండగా నీ చేతుల మీదుగానే భవన నిర్మాణానికి భూమిపూజ, గృహ ప్రవేశం చేశావు. ఈరోజు నేను పార్టీ మారగానే సక్రమ నిర్మాణం కాస్తా అక్రమమైందా? ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా పని చేశానని దళితుడినైన నాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నావు.. ఆరాచకం సృష్టిస్తున్నావు.
ఉమా.. నీ పతనం ప్రారంభమైంది’.. అంటూ వైఎస్సార్‌సీపీ దళిత నేత, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీష్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ సోమవారం జగదీష్ విజయవాడ ప్రకాష్ నగర్‌లోని తన ఇంటి వద్ద గుండు గీయించుకుని, అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
2012లో నేను ప్రకాష్ నగర్‌లో కాట్రగడ్డ హరిబాబు అనే వ్యక్తి నుంచి 224 గజాల స్థలాన్ని కొని అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకున్నా. 2014లో టీడీపీలో ఉన్న సమయంలోనే అక్కడ ఇంటి నిర్మాణం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బొండా చేతుల మీదుగానే భూమి పూజ జరిగింది. ఉమా తీరు, ఆయన విధానాలు నచ్చక నేను ఈ మధ్య వైఎస్సార్‌సీపీలో చేరి ఉమాకు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పనిచేశా. ఇది మనసులో పెట్టుకుని ఎన్నికల్లో గెలవగానే దళితుడినైన నాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గతంలో నేను టీడీపీలో ఉన్నా.
కార్పొరేటర్‌గా కూడా గెలుపొందా. అప్పుడు బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ఎంతో కృషిచేశా. తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెప్పగా ‘నా కింద పనిచేసే దళితుడవు.. ఎమ్మెల్యేగా పోటీచేస్తావా’ అంటూ ఆయన నాపై కక్ష పెంచుకున్నారు. ఇప్పుడు నా ఇల్లు అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి కూలగొట్టించారు. 2014లో భూమిపూజ చేసిన రోజు సక్రమంగా ఉండి ఈరోజు అదెలా అక్రమం అయ్యిందో బొండా సమాధానం చెప్పాలి. నా ఇంటిని క్రమబద్దికరించాలని గతంలోనే దరఖాస్తు చేశా. కానీ, బొండా ఒత్తిడికి మున్సిపల్ అధికారులు తలొగ్గి అది అక్రమ నిర్మాణమంటూ నోటీసులు జారీచేశారు.
నోటీసుల్లో 24 గంటల వ్యవధి అంటూ పేర్కొని.. నేనులేనప్పుడు నోటీసిచ్చిన ఎనిమిది గంటల్లోపే కూల్చేశారు. ఎక్కడ అక్రమం జరిగిందో చెబితే నేనే నిర్మాణాన్ని తొలగించేవాడిని. కానీ, బొండా కక్ష సాధింపులకు అధికారులు సహకరిస్తున్నారు. నేను, నా భార్య ఎమ్మెల్యే కాళ్లపై పడితే వదిలేస్తానని చెబుతున్నారు. కానీ, నేను ఏ తప్పూ చేయలేదు.. ఎవరి కాళ్లపై పడాల్సిన అవసరంలేదు. ఇకపై బొండా అరాచకాలను నియోజకవర్గంలో ప్రచారం చేస్తా. కూల్చిన భవనం ఫొటోలు ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రచారం చేస్తా.
నేను సమరయోధుల భూములు ఆక్రమించుకోలేదు..
ఇక బొండా ఉమా మాదిరిగా నేను స్వాతంత్య్ర సమరయోధుల స్థలాలను ఆక్రమించుకోలేదు. నేను స్థలం కొని ఇల్లు కట్టాను. అప్పట్లో ఎమ్మెల్యే బొండా ఉమా స్వాతంత్య్ర సమరయో«ధుల స్థలాలు ఆక్రమించుకున్నారని, టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన భార్యపై కేసు నమోదైంది. ఇక అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటున్న మున్సిపల్ అధికారులు భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లోని బొండా అక్రమ భవనాలను కూల్చగలరా? ఇదే రోడ్డులో వందల అక్రమ నిర్మాణాలు ఉన్నా వాటినెందుకు కూల్చలేదు? నేను వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నానని, దళితుడిని కావడంవల్లే నాపై వేధింపులకు పాల్పడుతున్నారు.
అధికారులు తస్మాత్ జాగ్రత్త..
బొండా ఉమాతో మున్సిపల్, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఎంతోమంది అధికారులపై దురుసుగా ప్రవర్తించిన చరిత్ర అతనిది. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు.. అధికారులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. ఉమా ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏ అధికారి పనిచేయలేరు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి బదిలీ చేసుకుని వెళ్లిపోవాలి. బంగారంలాంటి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తా. బొండా అరాచకాలను సీఎం చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తా.
Comments
Please login to add a commentAdd a comment