
మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. చిత్రంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
17 మంది వీసీల రాజీనామాలపై విచారణకు శాసనమండలిలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల మూకుమ్మడి రాజీనామాలపై శాసన మండలి మరోసారి అట్టుడుకింది. వీసీల రాజీనామాలపై విచారణకు మండలిలో వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేయడంతో ఆధారాలిస్తే విచారణ జరిపిస్తామని ఇటీవల విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు.
బెదిరింపులు, మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామా చేశారని వైఎస్సార్‌సీపీ మంగళవారం సభలో ఆధారాలు సమర్పించి.. ‘ఇవిగో ఆధారాలు.. చిత్తుశుద్ధి, ధైర్యం ఉంటే నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేయడంతో అధికారపక్షం కంగుతింది. మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘వీసీలను ఉన్నత విద్యా మండలి నుంచి బెదిరించి రాజీనామా చేయమని చెప్పారనడానికి ఆధారాలిస్తున్నాం.
వీసీల కార్యాలయాలకు వెళ్లి ఎలా దౌర్జన్యం చేశారో వీడియోలు కూడా ఇస్తున్నాం. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. వారు తప్పు చేయలేదని అనుకుంటే విచారణకు ఆదేశించాలి. కథలు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేయొద్దు’ అని సూటిగా డిమాండ్ చేశారు. దీనికి మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. బెదిరించి, భయపెట్టి రాజీనామాలు చేయించినట్టు ఎక్కడా వీసీల రాజీనామా పత్రాల్లో లేదని చెప్పారు.
ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై తాము ప్రవేశపెడుతున్న ప్రివిలేజ్ మోషన్‌ను స్వీకరించాలని మండలి చైర్మన్‌ను కోరారు. గత ప్రభుత్వంలోనూ వీసీలు రాజీనామా చేశారంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తాము ఉన్నత విద్యావంతులను వీసీలుగా నియమించామని, అంతర్జాతీయ వర్సిటీల నుంచి కూడా ఏపీ వర్సిటీల్లో వీసీల పోస్టులకు క్యూ కడుతున్నారంటూ గొప్పలు చెప్పుకొన్నారు.
గత ప్రభుత్వంలో విద్యాశాఖను ఏటీఎంగా వాడుకున్నారని లోకేశ్ అనడంతో బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉన్నత విద్యా మండలి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామాలు చేసినట్టు తామూ చెప్పామని, అందుకే విచారణ అడుగుతున్నామని బొత్స అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటిది జరగలేదని చెప్పారు. వారు చెబుతున్నట్టుగానే 2014 నుంచి వీసీల రాజీమాలపై విచారణ చేయాలని బొత్స డిమాండ్ చేశారు.
మీ నియామకాల్లో తప్పులతోనే రాజీనామా!
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం వీసీల నియామకాల్లో తప్పులు చేసిందని, వాటిని కోర్టులు తప్పుపట్టాయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 2019 జూలై 15న కోర్టు ఆదేశాలివ్వడంతో కొందరు వీసీలు రాజీనామా చేశారని, మరికొందరు చేయలేదని వివరించారు.
ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయమని చెప్పే హక్కును ఉన్నత విద్యా మండలి అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 4 రోజుల్లోనే 17 మంది వీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయలేకపోతున్నారని నిలదీశారు.
లోకేశ్ నోటి దురుసు!
వీసీల రాజీనామాలపై ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేశ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. వ్యక్తిగత విమర్శలు, సభలో లేని మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ‘సాక్షి’లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా విచారణ చేస్తామని బుకాయించారు. ఇంగ్లిష్ రాని వారిని వీసీలుగా నియమించారని హేళన చేశారు. చివరికి మంత్రి లోకేశ్ సమాధానం చెప్పకుండానే చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
విచారణపై ప్రభుత్వం తోకముడిచింది: బొత్స
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపిస్తామని సవాల్ చేసిన ప్రభుత్వం.. మండలిలో తాము ఆధారాలు చూపగానే తోక ముడిచిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన అసెంబ్లీ బయట మాట్లాడుతూ.. ఆధారాలు చూపిస్తే విచారణకు సిద్ధమంటూ సవాల్ చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడెందుకు వెనక్కి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయాలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. తాము సభలో సమర్పించిన ఆధారాలకు సమాధానం చెప్పలేక లోకేశ్ దబాయింపులు, బుకాయింపులు, దూషణలకు తెగబడ్డాని చెప్పారు. న్యాయ విచారణపై ఎందుకంత భయమని అన్నారు. వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించడం మొత్తం విద్యా వ్యవస్థకే కళంకమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment