సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్ట్‌లు తమ ప్రభుత్వంలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఏ శాఖ మీదా అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం అని చెప్పారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ మీద మాటలాడి లోకేష్ అభాసు పాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు. 15ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్, మూలపేట పోర్ట్ నిర్మాణం లోకేష్‌కు కనిపించలేదా?. మెడికల్ కాలేజీలు, భోగాపురం ఎయిర్‌పోర్టు ఎవరి హయాంలో నిర్మాణ పనులు జరిగాయి. ఇన్ఫోసిస్ ఐటీ పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చింది. మేము తెచ్చిన టీసీఎస్ మీరు తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం. రుషికొండపై అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టారు. ఆ భవనాన్ని ప్రధాని, రాష్ట్రపతి అవసరాల కోసం వాడుకోవచ్చు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధానితో లోకేష్ చెప్పించగలరా?. స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పగలరా?. ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది. వరదలు విపత్తులకు వైఎస్ జగనే కారణం అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నేను మంత్రిగా ఉన్న సమయంలో ఒప్పందం జరిగింది. 1300 ఎకరాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టుకు అన్ని అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చింది. 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారత దేశం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ సాధించాము. రైల్వే జోన్‌కు 52 ఎకరాల భూములు జనవరి నెలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. టీడీపీ హయాంలో బకాయిలు పెట్టిన రూ.50వేల కోట్లు వైఎస్ జగన్ చెల్లించారు. అప్పు తెచ్చిన లక్ష 20వేల కోట్లు ఏం చేశారు?.
పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారు అంటున్న లోకేష్, వైఎస్సార్‌సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమవి అని ఎలా చెప్పుకుంటారు. వాలంటీర్లకు 10వేల రూపాయలు ఇస్తామని ఎలా మేనిఫెస్టో పెట్టారు. గంజాయి రవాణా చేసే ఖైదీలు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. హోం మంత్రి ముందు తన పేషీలో ఉన్న గంజాయి మొక్కను తొలగించారా లేదా?. రోజుకొక మంత్రి అవినీతి బాగోతం బయటపడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment