సాక్షి,విశాఖపట్నం:స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్‌షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.
కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్‌కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment