సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందని.. ఒక బాధ్యతగా చేసిన పనిని తప్పుగా సృష్టిస్తారా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసులు పెట్టో, బెదిరించో పరిపాలన చేయాలంటే సాధ్యం కాదన్నారు.
‘‘ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. ప్రజల్లోనే ఉంటా. ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు.. ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేను నూటికి నూరు శాతం ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే వెళ్లా.. ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి?’’ అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.
‘‘నామీద 11 సెక్షన్లతో కేసు పెట్టారు. ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. వైఎస్ జగన్ వెంట నడుస్తున్న వారికి భయాందోళన కల్పించాలని కుట్ర పన్నారు. బాలిక మీద దారుణం జరిగిందని ఆమె తండ్రే నాతో చెప్పారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచా. ఆమెని తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించా..
..72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం నేను చేసిన తప్పా?. బాధ్యతగా ఉండటం తప్పుగా సృష్టిస్తారా?. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా?. బాధితురాలి తండ్రి అన్యాయం జరిగిందని చెప్తేనే నేను వెళ్లాను. నేను ఎక్కడకూ వెళ్లను, పారిపోను. నా ఫోన్ స్విచ్చాప్ చేయను. నేను అందుబాటులోనే ఉన్నా. ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే నేను వెళ్లాను
..ఆ బిడ్డ గురించి నేను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఒక్కమాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. తీవ్రవాదుల మీద పెట్టినట్టు నామీద కేసు పెట్టారు. ఆ తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లారు. నాగార్జున రెడ్డి వ్యక్తి ఆ తండ్రిని తీసుకుని తిరుపతి వెళ్లాడు. కూతురి దగ్గరకు తండ్రిని చేర్చాడు. అతనిమీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారు. పరామర్శకు వెళ్తే పోక్సో కేసులు పెట్టవచ్చని చూపిస్తున్నారు. ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment