
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేంది ఏమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని వైఎస్సార్‌సీపీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 16) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి.. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదన్నారు. ‘ కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఎవరూ ప్రశాంతంగా బతకలేదు.
చంద్రబాబు గత పాలనలో రాష్ట్రం మావోయిస్టులు, ఫ్యాక్షన్, హత్యలు, కరువుతో ఉండేది. వైఎస్ఆర్ సీఎం అయ్యాకనే మావోయిస్టులను కంట్రోల్ చేశారు. ఫ్యాక్షన్ వద్దని వ్యవసాయం వైపు జనాన్ని వైఎస్సారే మరల్చారు. ఐటీ తెచ్చానని బడాయి మాటలు చెప్పుకోవటం తప్ప చంద్రబాబు చేసిందేంటి?, రాష్ట్ర అభివృద్ధి, గ్రోత్ రేట్ చంద్రబాబు హయాంలో దారుణంగా పడిపోయింది.
కరోనా ఉన్నా జగన్ హయాంలో రాష్ట్ర గ్రోత్ రేట్ భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు ఆలోచించాలి. అది వదిలేసి 2047 విజన్ పేరుతో డ్రామాలు ఎందుకు?, జగన్ ప్రజల కోసం సచివాలయ వ్యవస్థ తెచ్చి పాలనను వారి ముంగిటకే తెచ్చారు. కానీ చంద్రబాబు వాట్సప్ పాలన అంటూ బిల్డప్ మాటలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.
నాలుగు లక్షల పెన్షన్లు తొలగించి వృద్దులు, వికలాంగుల జీవితాలతో అనుకుంటున్నారు. విద్యా రంగంలో జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి రెండిటినీ పక్కన పెట్టేశారు. టమోటా, ఉల్లి సహా ప్రతి పంట సాగు చేసిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కనీసం యూరియా కూడా అందించలేని వ్యక్తి చంద్రబాబు. P4 అంటూ కిత్త కథ మొదలెట్టిన చంద్రబాబు ఎంతమంది జీవితాలను బాగు పర్చారు?, పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు, గ్రామీణ రోడ్ల మీద కూడా టోల్ పెట్టి డబ్బు వసూలు చేయబోతున్నారు.
ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా?. జగన్ మెడికల్ కాలేజీలను తెస్తే వాటిని ప్రయివేటు వారికి అమ్మేయటం చంద్రబాబుకే చెల్లింది. నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పే చంద్రబాబు విజనరీనా?, మెరుగైన విద్య, వైద్యం అందించిన జగన్‌ని విమర్శించే స్థాయి టీడీపీకి లేదు. ఎన్నీ అభివృద్ది కార్యక్రమాలు చేసినా జగన్ పబ్లిసిటీ చేసుకోలేదు. చంద్రబాబు ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
నిరుద్యోగ భృతి, యాభై ఏళ్ల మహిళలకు పెన్షన్లు, ఆడబిడ్డనిధి వంటివేవీ చేయకుండానే అన్నీ చేశామని నిస్సిగ్గుగా చెప్పుకోవటం చంద్రబాబుకే చెల్లింది. అమరావతిలో నీరు తోడే కార్యక్రమం తప్ప ఇంకేం జరుగుతోంది?, ఏదైనా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.2 వేల కోట్ల పైన బకాయి పెట్టారు. నెట్ వర్క్ ఆస్పత్రిల్లో వైద్యం అందక పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఇవేమీ చంద్రబాబు కంటికి కనడకపోవటం దారుణం’ అని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.