సభలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు చీకటికి ప్రతినిధి అయితే సీఎం వైఎస్ జగన్ వెలుగులకు ప్రతినిధి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తారని.. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు వారిని అవహేళన చేశారని గుర్తుచేశారు. బాబుకు బీసీలంటే చిన్నచూపు అని, వారిని అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తారని విమర్శించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణ కృతజ్ఞతా సభలో సజ్జల మాట్లాడారు.. నాయీ బ్రాహ్మణులు కాలర్ ఎగరేసి బతికేలా సీఎం జగన్ చేశారు. అలాంటి నాయకుడికి నాయీ బ్రాహ్మణులు అండగా నిలవాలి. వారికి ఇప్పటికే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పించారు. చట్ట సభల్లో కూడా అవకాశం దక్కుతుంది. త్వరలో ఎమ్మెల్సీ కూడా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీసీలే బాబును భూస్థాపితం చేస్తారు. బీసీలకు ఇప్పటికే అధికభాగం పదవులు ఇవ్వగలిగాం.
సమాజంలో బీసీల ఆత్మగౌరవం పెరిగేందుకే ఇదంతా చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు బాబు హయాంలో అంతటా అవినీతి, అక్రమాలే. లోకేశ్‌కు ఏం పీకుతున్నారనే మాట తప్ప మరేదీ నేర్పలేదేమో? నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు మీడియా బలం తప్ప మరేమీలేదు. ఇక వచ్చే ఎన్నికలలో వంచనతోనే చంద్రబాబు గెలవాలనుకుంటున్నారు. ఆయన పాలనలో సామాన్యులు బతకలేరు. ఈసారి చంద్రబాబును రాజకీయంగా అంతం చేయాలి. వైఎస్సార్‌సీపీ 175కి 175 సీట్లు విజయం సాధించడమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలి.
చెప్పింది చెప్పినట్లుగా.. : యానాదయ్య
సభాధ్యక్షుడు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పాదయాత్రలో నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు. జగనన్న చేదోడు ద్వారా రాష్ట్రంలోని వృత్తిదారులైన నాయీబ్రాహ్మణులకు ఇప్పటికీ మూడుసార్లు పదివేల చొప్పున అంటే రూ.30 వేలు వారి ఖాతాల్లో వేశారన్నారు. అలాగే, వృత్తిదారులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాక, వివిధ దేవాలయాలలో పనిచేసే నాయిబ్రాహ్మణులకు రూ.20 వేలు వేతనం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎం జగన్‌కు ఎప్పటికీ అండగా నిలుస్తామని యానాదయ్య స్పష్టంచేశారు.
బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలి..
మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. అసెంబ్లీలో, మండలిలో వారిని అడుగుపెట్టించేలా చేయగల సత్తా సీఎం జగన్‌కే ఉందన్నారు. ఆయన తన పాదయాత్ర ద్వారా 139 బీసీ కులాల వారితో మాట్లాడి ఆయా కులాల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని.. తన కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందిని మంత్రులుగా చేసి సామాజిక న్యాయాన్ని అమలుచేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు.
ఆయన తన మాటను ఎలా నెరవేర్చారో నాయీ బ్రాహ్మణులందరూ అదే రీతిలో వచ్చే ఎన్నికల్లో జగన్‌ని సీఎంని చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు అండగా నిలవాల్సిన బాధ్యత బీసీలందరిపై ఉందన్నారు. దివంగత నేత వైఎస్సార్, జ్యోతిరావు ఫూలే, ధన్వంతరీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
సభలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఎ. నారాయణమూర్తి, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు, ఆరెపాటి పెంటారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు కోటేశ్వరరావు (ఆంధ్ర), ఎం సుబ్బరాయుడు (రాయలసీమ) వెంపటాపు లోకరాజు (ఉత్తరాంధ్ర), రాష్ట్ర కోశాధికారి ఎస్. ధనవిజయుడు, గౌరవ సలహాదారులు కిందాడ సత్యన్నారాయణ దేవాలయాల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, డైరెక్టర్ తొండమల్లు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment