సాక్షి, అమరావతి: ‘36 గంటలపాటు నిరాహార దీక్ష చేసిన చంద్రబాబు.. అదీ 74 ఏళ్ల వయస్సులో.. తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధపడుతూ.. అన్ని గంటలపాటు దీక్ష చేసిన తర్వాత.. గంటన్నరపాటు ఆవేశంతో ఊగిపోతూ సుదీర్ఘ ప్రసంగం చేయగలరా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘చంద్రబాబు గురువారం కేవలం అర లీటర్ నీటిని మాత్రమే తీసుకున్నారని ఈనాడులో రాశారని, తీవ్రమైన మధుమేహ వ్యాధితో అన్ని గంటలపాటు ఏమీ సేవించకుండా.. చివర్లో సుదీర్ఘ ప్రసంగం చేయడం చూస్తే ఆ దీక్ష ఓ ప్రవాహసనమన్నది స్పష్టమవుతోంది’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘ఎవరైనా దీక్ష చేస్తే ఒక కారణముండాలి. దాని పరిష్కారం దిశగా సాగాలి. దానికి అనుగుణంగానే ప్రసంగాలు ఉండాలి. అసలు ఏం ఆశించి దీక్ష చేశారో తెలుగుదేశం పార్టీ నేతలకే అర్థం కాలేదు. చివరికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ దీక్షను ఎందుకోసం చేస్తున్నారని పక్కనున్న వారిని ఆరా తీయడం మీడియాలో కన్పించింది. నూలుదండ వేసుకుని గాంధేయవాదిలా చంద్రబాబు కూర్చుంటే.. పక్కన నిల్చొని ప్రసంగించిన టీడీపీ నాయకులు.. నరుకుతాం.. చంపుతాం అంటూ రౌడీల్లా మాట్లాడారు.
ఎక్కడెక్కడి సంఘ వ్యతిరేక శక్తులు, మాఫియా మూకలు ఒకచోట సమావేశమైతే ఎలా ఉంటుందో అలా ఉందని చాలా మంది నాతో అన్నారు. చంద్రబాబు మెడలో ఆ పార్టీ నేతలు డబ్బులతో దండలేసి, చందాలు ఇచ్చారు. అసలు దీక్షలో చందాలు ఇవ్వడమేమిటి? బాబు దీక్ష, ఆయన పడుకున్న తీరు, జరిగిన వ్యవహారమంతా ఓ ప్రహసనంలా ఉంది’ అని చెప్పారు. ‘‘సీఎం వైఎస్ జగన్‌ను భోషడీకే అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో తిట్టించిన చంద్రబాబు.. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉద్యమానికి దిగారు.
ప్రపంచంలో బూతు మాటల కోసం ఉద్యమం చేసే స్థాయికి దిగజారిన నేత ఒక్క చంద్రబాబే. పట్టాభి అన్న బూతులను వినలేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజంగా పట్టాభి అన్నది బూతు కాకపోతే.. చంద్రబాబును మోసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5లు ఆ పదాన్ని ఎందుకు ప్రచురించలేకపోతున్నాయి? ప్రజలను వెర్రివాళ్లుగా భావిస్తున్నారా?’ అని ప్రశ్నించారు.
ఢిల్లీ పెద్దలనూ అలానే పలకరిస్తారా?
‘భోషడీకే అనే పదానికి బాగున్నారా.. నమస్కారం అనే అర్థాలు ఉన్నాయని టీడీపీ నేతలు కొత్త అర్థాలు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తామని చెబుతున్నారు కదా. వాళ్లని కూడా భోషడీకే అని పలకరించగలరా? ఆ మాట అని చొక్కా నలగకుండా బయటకు రాగలరా?’ అని సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ చొక్కా నలగకుండా బయటకు వస్తే.. తాము ముక్కును నేలకు రాసి, క్షమాపణలు చెబుతామని స్పష్టంచేశారు. టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ అభిమానులు దాడి చేయడానికి కూడా క్షమాపణలు చెబుతామని చెప్పారు.
కక్ష తీర్చుకోవడం కోసం అధికారమా?
ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తామంటారు. కానీ.. దీక్షలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, నేతల ప్రసంగాలను ఒక్కసారి పరిశీలిస్తే.. అధికారంలోకి వస్తే గంట సమయం చాలు.. చంపుతాం.. నరుకుతాం.. వడ్డీతో సహా బాకీ తీర్చుకుంటాం అని ప్రసంగించారు. అంటే కక్ష తీర్చుకోవడానికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టాలని వారు కోరుతున్నారు. మేం అలా కాదు. ప్రజలకు సేవ చేయడానికే అధికారంలో ఉన్నాం. చంద్రబాబు తక్షణమే అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఇంతగా దిగజారాలా? విద్వేషాలను రెచ్చగొట్టాలా? రెచ్చగొట్టే వారిని ప్రజలు వదలరు. పెద్దపెద్ద రౌడీలే పోయారు.. వీళ్లెంత? మీ అరాచకాలను ప్రజలకు వివరించి.. చైతన్యవంతం చేస్తాం. ప్రజలే బుద్ధిచెబుతారు’ అని అన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉంటే కడుపుమంట
గత రెండున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజలను మమకారంతో, చూస్తున్న జగన్ గారి పాలనలో ప్రశ్నించడానికి టీడీపీకి ఏమీ మిగల్లా. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే చంద్రబాబుకు కడుపుమంట. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే పక్కా ప్రణాళికతో సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పదజాలంతో దాడి చేశారు. దానికి కడుపుమండిన సీఎం జగన్‌ను అభిమానించే ప్రజలు టీడీపీ కార్యాలయం మీదకు వెళ్లారు. ఈ దారుణ పరిస్థితికి కారణం చంద్రబాబే.
ఇలాంటి రాజకీయాలు అవసరమా?
‘బూతు వ్యాఖ్యలను సమర్థిస్తూ జాతీయ ఉద్యమం చేయడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. వాస్తవాలను జాతీయ పార్టీలకు వివరిస్తాం. చంద్రబాబు బూతుపురాణాన్ని వివరిస్తాం. అబద్ధం, చంద్రబాబు వేర్వేరు కాదు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని జాతీయపార్టీలకు వివరిస్తాం. ఇలాంటి రాజకీయాలు అవసరమా? అన్నది దేశవ్యాప్తంగా చర్చ చేయాలని ఆ పార్టీలను కోరతాం. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత టీడీపీ కోల్పోయింది. ఎన్నికల కమిషన్ వద్దకు మా పార్టీ ఎంపీలను పంపి.. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరతాం’ అని సజ్జల చెప్పారు.
టీడీపీ ఉత్తరాంధ్ర నేతలే గంజాయిని పెంచి పోషించారు
గంజాయి స్మగ్లింగ్ రాత్రికే రాత్రే జరుగుతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ సర్కార్ హయాంలోనే ఉత్తరాంధ్రలో ఆపార్టీ నేతలు గంజాయి స్మగ్లింగ్‌ను పెంచి పోషించారు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నా సీఎం సమీక్ష చేయడంలేదని బాబు అంటున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ గంజాయికి అడ్డుకట్టవేయడానికి పటిష్టమైన చర్యలు చేపట్టారు. గంజాయి, ఇతర అక్రమ రవాణాను అడ్డుకోవడానికి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీని) ఏర్పాటు చేశారు. తరచూ రివ్యూ చేస్తూ ఎస్‌ఈబీతో గంజాయిపై ఉక్కుపాదం మోపారు.
1500 లోడ్లు పట్టుకున్నారు. 2.93 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేశారు. 2015 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,689 గంజాయి అక్రమ రవాణా కేసులు రిజిస్టరవగా, అందులో 4 వేలకు పైగా కేసులు తెలుగుదేశం పార్టీ హయాంలో నమోదైనవే. చంద్రబాబు హయంలో 2015లో 683, 2016లో 899, 2017లో 1200, 2018లో 871, 2019లో 997, 2020లో 1583, 2021లో 1450 నమోదయ్యాయి.
కానీ.. చంద్రబాబు ఇప్పుడే గంజాయి స్మగ్లింగ్ ప్రారంభమైనట్లు అబద్ధాలు చెబుతున్నారు. బోడిగుండుకూ మోకాలికి ముడిపెట్టినట్లు గంజాయికి, గుజరాత్‌లో ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌కు ముడిపెడుతూ.. ఆ వ్యాపారాన్ని సీఎం వైఎస్ జగన్ చేస్తునట్లు అభూతకల్పనలు జోడించి.. విష ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాలను అరికట్టి.. యువతను రక్షించడం కోసం సీఎం వైఎస్ జగన్ ఎస్‌ఈబీని ఏర్పాటు చేశారు చంద్రబాబూ.. నీలా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయలేదు’ అని అన్నారు.
మహిళల్ని, తల్లుల్ని అవమానించేలా పట్టాభి మాట్లాడారు
మహిళల్ని, తల్లుల్ని అమానించేలా టీడీపీ నేతలు నీచంగా మాట్లాడారని, బోషడీకే అనే పదాన్ని ఒకసారి కాదు నాలుగు సార్లు అనిపించారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గంజాయి వ్యాపారం చేస్తున్నారని మొదలు పెట్టి భోషడీకే బూతు పదం వరకు ఎందుకు వ్యవహారం నడిపించారో ప్రజలకు వారే సంజాయిషి ఇచ్చుకోవాలని తెలిపారు.
74 ఏళ్ళ వయసులో, భార్య, మనమడు ఉన్న చంద్రబాబు ఇంట్లో కూడా, ఆ మాట వినాలంటే, మహిళలు ఇబ్బంది పడతారన్నారు. అలాంటి బూతు పదాలు మాట్లాడించిన ఆయన పార్టీ కార్యాలయాన్ని దేవాలయం అంటున్నారని, దేవాలయం అయితే చెండాలం మాట్లాడిన అతన్ని చెప్పు తీసుకుని కొట్టాలి కదా అని సజ్జల ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment