
సాక్షి, భీమవరం/తుని రూరల్/ఒంగోలు/తిరుమల: అవినీతికి పాల్పడిన చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడంలేదని మంత్రులు, మాజీ మంత్రి ప్రశ్నించారు. స్టేలతో దుర్భర జీవితం గడుపుతున్న చంద్రబాబు.. ఈ నోటీసులతో ఢిల్లీలో పెద్దల కాళ్లు పట్టుకుని దేబిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలు ప్రత్యేకదృష్టి సారించి చంద్రబాబు అక్రమాలను వెలికితీయాలని కోరారు.
ఎన్నో పాపాలు చేసిన ఆయన దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేరని చెప్పారు. అవినీతి, అక్రమాల కేసుల్లో చంద్రబాబు, లోకేశ్ జైలుకెళతారన్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రజలకు చెప్పని ఎల్లో మీడియా విశ్వసనీయత ఏమిటని ప్రశ్నించారు. మంత్రులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో మాట్లాడారు.
తేలుకుట్టిన దొంగలా చంద్రబాబు
మంత్రి కారుమూరి
భారీ స్కామ్‌లో కూరుకుపోయిన చంద్రబాబునాయుడు ఐటీ శాఖ నోటీసులపై ఎందుకు మాట్లాడటంలేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారులశాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నోటీసులు అందుకున్న బాబు తేలుకుట్టిన దొంగలా ప్రవర్తిస్తున్నాడన్నారు.
చంద్రబాబు అక్రమాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్.. బాబు అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్ర నిఘావర్గాలు చెవిలో చెప్పాయని ప్రచారం చేసుకున్న పవన్‌కు చంద్రబాబు స్కామ్‌ల గురించి చెప్పలేదా అని ఎద్దేవా చేశారు.
బాబూ నువ్వు రావద్దు..
మంత్రి దాడిశెట్టి రాజా
చంద్రబాబూ నువ్వు రావద్దు.. మా భవిష్యత్ పాడు చేయవద్దు.. అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. కాకినాడ జిల్లా తుని మండలం మర్లపాడులో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పేరుతో రూ.2 వేల కోట్లు దోచుకున్నాడని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్.. పీఏ ద్వారా దోచుకున్న రూ.118 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే సమాధానం చెప్పడంలేదని విమర్శించారు. దీనిపై ఎల్లో మీడియా వార్తలు రాయడం లేదేమని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
బాబు అవినీతిని దర్యాప్తు సంస్థలు వెలికితీయాలి
మంత్రి ఆదిమూలపు సురేశ్
అవినీతి, అక్రమాల కేసుల్లో చంద్రబాబు, లోకేశ్ కచ్చితంగా జైలుకెళతారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రస్తుతం దొరికిన దొంగ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు వేదిక అని తాము గతంలో చెప్పిన అంశం ఈ ఐటీ నోటీసులతో నిజమేనని తేలిందని చెప్పారు. దర్యాప్తు సంస్థలు ఆయన అవినీతిని వెలికి తీయాలని కోరారు. అమరావతి ముసుగులో అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి వేలకోట్లు దోచుకున్నారన్నారు. దీనిపై చంద్రబాబు మౌనం వీడాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు దేవుడి నుంచి తప్పించుకోలేరు
మాజీ మంత్రి కొడాలి నాని
ఎన్నో పాపాలు చేసి తప్పించుకున్న చంద్రబాబునాయుడు దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేరని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ అందరూ బాగుండాలని, 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మరో అవకాశం కల్పించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఆయన చిన్న విషయంగా చెబుతున్నారన్నారు. ఎన్ని పాపాలు చేసి ఎక్కడ నుంచైనా తప్పించుకోగలంగానీ.. ఆ పైన ఉన్న దేవుడి దగ్గర నుంచి, ఎన్నికల్లో తీర్పునిచ్చే ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment